Ambedkar with Jyotirlinga Darshan | పర్యాటకులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. అంబేద్కర్ యాత్ర విత్ పంచ జ్యోతిర్లింగ దర్శనం పేరుతో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీలో పర్యటన తొమ్మిది రోజుల పాటు సాగనున్నది. భారత్ గౌరవ్ రైలులో ప్రయాణం ఉంటుంది. ఈ పర్యటనలో అంబేద్కర్ జన్మభూమితో పాటు మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, త్రయంబకేశ్వర్, భీమ్శంకర్, ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాలను దర్శించుకునే అవకాశం ఉంది. సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్కేడ్, నాందేడ్, పూర్ణ రైల్వే స్టేషన్లలో పర్యాటకులు రైలు ఎక్కేందుకు వీలు కల్పించింది. ఈ ప్యాకేజీలో పర్యటన ఆగస్టు 16న మొదలు కానున్నది.
ఈ నెల ఆగస్టు 16న తొలిరోజు మధ్యాహ్నం 2 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుతుంది. రెండోరోజు ఉదయం 8 గంటలకు రైలు నాగ్‌పూర్‌కు చేరుతుంది. హోటల్‌కు చేరుకొని దీక్షాభూమిని సందర్శిస్తారు. ఈ దీక్షభూమికి అంబేద్కర్ జీవితంలోనే కాదు బౌద్ధంలోనూ ప్రత్యేక స్థానం ఉంటుంది. 1956 అక్టోబర్ 14న అంబేద్కర్‌తో పాటు సుమారు నాలుగు లక్షల మంది ఇక్కడే బౌద్ధ దీక్ష తీసుకున్నారు. ఇక అదే రోజు అవకాశం ఉంటే స్వామి నారాయణ్ మందిరాన్ని దర్శిస్తారు. తిరిగి రైల్వేస్టేషన్‌కు చేరుకొని రాత్రి 8 గంటలకు నాగ్‌పూర్ నుంచి బయలుదేరుతారు. మూడోరోజు ఉదయం 10 గంటలకు ఉజ్జయినికి చేరుకుంటారు. హోటల్‌కు చేరుకొని ఫ్రెషప్ అయ్యాక ఉజ్జయిని మహాకాళేశ్వర్ దర్శించుకుంటారు. రాత్రి ఉజ్జయినిలోనే బస ఉంటుంది. నాలుగో రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ అయ్యాక రోడ్డు మార్గం ద్వారా అంబేద్కర్ జన్మస్థలానికి వెళ్తారు.
దీన్నే జన్మభూమిగా పిలుస్తుంటారు. మధ్యాహ్నం తర్వాత ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్తారు. అక్కడి నుంచి నాసిక్‌కు బయలుదేరుతారు. ఐదోరోజు సాయంత్రం నాసిక్‌కు చేరుకొని రాత్రి అక్కడే హోటల్లో బస ఉంటుంది. ఇక ఆరో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక హోటల్ రూమ్ చెక్ అవుట్ చేసి త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటారు. తిరిగి నాసిక్ రైల్వే్స్టేషన్కు చేరుకొని పుణేకు బయలుదేరి వెళ్తారు. ఏడోరోజు వేకువ జామున పుణే చేరుకొని హోటల్‌కు వెళ్తారు. రెడీ అయ్యాక భీమ శంకర్ జ్యోతిర్లింగ క్షేత్రం దర్శానికి వెళ్తారు. ఆ తర్వాత తిరిగి రైల్వేస్టేషన్‌కు చేరుకొని ఔరంగాబాద్‌కు ప్రయాణం మొదలుపెడుతారు. ఎనిమిదో రోజు ఉదయం ఔరంగాబాద్‌కు చేరుకుంటారు. అనంతరం హోటఅల్కు చేరుకొని.. అనంతరం ఘృష్ణేశ్వర్ దర్శనానికి వెళ్తారు. దర్శనం అయ్యాక తిరిగి సాయంత్రం 4గంటలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. తొమ్మిదో రోజు ఉదయం సికింద్రాబాద్‌కు రైలు చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది.
ఈ అంబేద్కర్ యాత్ర విత్ పంచ జ్యోతిర్లింగ దర్శనం ప్యాకేజీని మూడు కేటగిరిల్లో ఐఆర్సీటీసీ అందుబాటులో ఉంచింది. ఎకానమి కేటగిరిలో డబుల్, ట్రిపుల్ షేరింగ్‌లో రూ.14,700 చెల్లించాల్సి ఉంటుంది. ఐదేళ్ల-11 సంవత్సరాల మధ్య పిల్లలకు రూ.13,700 చెల్లింస్తే సరిపోతుంది. స్టాండర్డ్ కేటగిరిలో డబుల్, ట్రిపుల్ షేరింగ్‌లో రూ.22,900.. పిల్లలకు రూ.21,700 ఉండగా.. కంఫర్ట్ కేటగిరిలో రూ.29,990.. పిల్లలకు రూ.28,400 ధర నిర్ణయించారు. ఎకానమి కేటగిరిలో రైలులో స్లీపర్ క్లాస్‌లో ప్రయాణం, నాన్ ఏసీ గదుల్లో వసతి ఉంటుంది. స్టాండర్డ్ కేటగిరిలో థర్డ్ ఏసీ క్లాస్‌లో ప్రయాణం, ఏసీ రూమ్‌లో వసతిని ఏర్పాటు చేస్తారు. కంఫర్ట్ కేటగిరిలో సెకండ్ ఏసీలో ప్రయాణం, ఏసీ గదుల్లో వసతి సౌకర్యం ఉంటుంది. ఈ ప్యాకేజీలోనే హోటల్లో వసతి, టీ, టిఫిన్, లంచ్, డిన్నర్ సౌకర్యం ఉంటుంది. అలాగే, ట్రావెల్ ఇన్సూరెన్స్ వర్తించడంతో పాటు టూర్ ఎస్కార్ట్, సెక్యూరిటీ సౌకర్యాలు కల్పిస్తారు. ఈ రైలులో మొత్తం 630 సీట్లు ఉంటాయని.. వివరాల కోసం ఐఆర్సీటీసీ టూరిజం వెబ్సైట్లో సంప్రదించాలని కోరింది.