Russian Model : అందాల పోటీలతో పాపులర్ అయిన రష్యా మోడల్ సెనియా అలెగ్జాండ్రోవా (Kseniya Alexandrova) మరణించింది. పెళ్లైన నాలుగు నెలలకే కారు యాక్సిడెంట్‌కు గురైన ఆమె.. ఆగస్టు 12న కన్నుమూసిది. జూలై 5న జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఆమె తలకు బలమైన గాయాలు కావడంతో మెదడు భాగం బాగా దెబ్బతిన్నది. కోమాలోకి వెళ్లిన ఆమెకు ఆస్పత్రిలో చికిత్స అందించినా కోలుకోలేదు. నెల రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది అలెగ్జాండ్రియా.
విశ్వ సుందరిగా, ప్రపంచ సుందరిగా కిరీటం ధరించి మురిసిపోవాలని ఎన్నో కలలు కన్న ఆమె 30 ఏళ్లకే తుదిశ్వాస విడవడంతో రష్యాలో విషాదఛాయలు అలుముకున్నాయి. జూలై 5న స్పోర్ట్స్ కారులో అలెగ్జాండ్రియా, ఆమె భర్త తమ ఇంటికి వెళ్మతున్నారు. వాళ్ల కారు ట్వెర్ ఒబ్లాస్ట్ అనే ప్రాంతానికి చేరుకోగానే జింక జాతికి చెందిన ఎల్క్ అనే జంతువు హఠాత్తుగా అడ్డువచ్చింది. దాంతో, కారు అదుపు తప్పింది. ఈ ఘటనలో వెనక సీట్లో ఉన్న అలెగ్జాండ్రియా తలకు పెద్ద గాయం కావడంతో ఆమె స్పృహ కోల్పోయింది.
‘ఆ రోజు మేము రక్తపు మడుగులో పడి ఉన్నాం. ఎల్క్ పాదాలు మా కారు అద్దాన్ని ముక్కలు చేశాయి. అవి నా భార్య తలకు గుచ్చుకున్నాయి. దాంతో ఆమె స్పృహ కోల్పోయి కోమాలోకి వెళ్లింది’ అని ఆ నాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు. ఆరడుగుల పొడవుతో.. అందాల రాశిలా ఉండే అలెగ్జాండ్రోవా 2017లో మిస్ రష్యా పోటీల్లో పాల్గొంది. టైటిల్‌కు ఒక్క అడుగుదూరంలో నిలిచిన ఆమె ఫస్ట్ రన్నరప్‌గా సరిపెట్టుకుంది.
మోడలింగ్ చేస్తూనే చదువుపై దృష్టి సారించిన ఈ ముద్దుగుమ్మ మాస్కో పెడగాజికల్ స్టేట్ యూనివర్సిటీ నుంచి సైకాలజీ కోర్సు పూర్తి చేసింది. ఎంతో ఉజ్వల భవిష్యత్తు కలిగిన అలెగ్జాండ్రోవా జీవితం విషాదాంతం కావడంతో ఆమె పనిచేస్తున్న మోడలింగ్ ఏజన్సీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది.