e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home Top Slides 1300 కోట్లతో స్టార్టప్‌ ఫండ్‌

1300 కోట్లతో స్టార్టప్‌ ఫండ్‌

 • ఐదేండ్లలో 10 లక్షల ఐటీ ఉద్యోగాలు
 • మూడు లక్షల కోట్ల ఐటీ ఎగుమతులే లక్ష్యం
 • ద్వితీయ శ్రేణి నగరాల్లో 50 వేల కొలువులు
 • మరో 12,000 డిజిటల్‌ తెలంగాణ సెంటర్లు
 • 2026 నాటికి రాష్ట్రమంతా 5జీ సేవలు
 • ఐటీ అంటే ఇంటెలిజెంట్‌ టెక్నాలజీ కూడా
 • ఐసీటీ పాలసీ-2 విడుదల చేసిన కేటీఆర్‌
 • మొదటి పాలసీ లక్ష్యాలు చేరుకున్నట్టు వెల్లడి

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో స్టార్టప్‌ కంపెనీలను ప్రోత్సహించేందుకు రూ.1,300 కోట్లతో ‘స్టార్టప్‌ ఫండ్‌’ను ఏర్పాటు చేస్తున్నట్టు ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. స్టార్టప్‌లకు తెలంగాణ కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచేలా 8,000 కంపెనీలకు మద్దతు అందిస్తామని చెప్పారు. వచ్చే ఐదేండ్లలో రాష్ట్రంలో ఐటీ విభాగంలో ఉద్యోగుల సంఖ్యను పది లక్షలకు చేర్చడం, ఐటీ ఎగుమతులను రూ.3 లక్షల కోట్లకు పెంచడమే రెండో ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ 2021-26 (ఐసీటీ) పాలసీ లక్ష్యమని ప్రకటించారు. గురువారం హెచ్‌ఐసీసీలో రెండో ఐసీటీ పాలసీని మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించి ప్రసంగించారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఐటీ హబ్స్‌ ఏర్పాటుచేసి, 50 వేల ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. ఎలక్ట్రిక్‌ వాహనాలు, బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్స్‌, కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌, మెడికల్‌ డివైజెస్‌, ఆటోమొబైల్‌ రంగాల్లో రూ.75 వేలకోట్ల పెట్టుబడులను రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్టు చెప్పారు. తద్వారా ఎలక్ట్రానిక్స్‌ రంగంలో కొత్తగా మూడులక్షల ఉద్యోగాలు లభించేలా కృషిచేస్తామని తెలిపారు.

ప్రతి పల్లె డిజిటల్‌మయం
రెండో ఐసీటీ ద్వారా ప్రజలకు అత్యాధునిక టెక్నాలజీని మరింత చేరువచేసే కార్యక్రమాలు చేపడుతామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పంచాయతీ స్థాయిలో డిజిటల్‌ సేవలు అందించేందుకు 12 వేల డిజిటల్‌ తెలంగాణ సెంటర్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రపంచంలోని ఉత్తమ స్మార్ట్‌సిటీ ప్రమాణాలకు అనుగుణంగా 40 స్మార్ట్‌ రీజియన్స్‌ ఏర్పాటుచేసేలా మున్సిపల్‌శాఖతో కలిసి స్మార్ట్‌సిటీస్‌ విభాగం ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఐటీరంగం వృద్ధి, పౌరులకు మెరుగైన ఐటీసేవల లక్ష్యంతో ఐదేండ్లకాలానికి 2016లో చేపట్టిన మొదటి ఐసీటీ వందశాతం విజయవంతమైందని చెప్పారు. ఐటీ, ఐటీఈఎస్‌ రంగంలో రాష్ట్రం అత్యధిక వార్షిక వృద్ధిరేటు నమోదు చేసిందని చెప్పారు. గత ఐదేండ్లలో 2.5 లక్షల ఉద్యోగాలను సృష్టించిందన్నారు. ఎలక్ట్రానిక్‌ సెక్టార్‌లో 1.5 లక్షల ఉద్యోగాలు సృష్టించి, దేశ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తిలో ఏడు శాతం వాటాకు చేరుకున్నామని చెప్పారు. తాజాగా తీసుకొచ్చిన ఈవీ, ఈఎస్‌ఎస్‌ పాలసీల ద్వారా భవిష్యత్తు అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని వివరించారు. ఐటీ, ఉత్పత్తి, ఇంజినీరింగ్‌, ఆర్‌అండ్‌డీ తదితర రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించటంలో తెలంగాణను దేశంలో నంబర్‌ వన్‌గా నిలిపేందుకు కృషిచేస్తున్నామని చెప్పారు. టెక్‌మహీంద్రా, సైయెంట్‌ తమ కార్యాలయాలను వరంగల్‌లో ప్రారంభించాయని తెలిపారు. టీసీఎస్‌, విప్రో, ఆక్సెంచర్‌ వంటి కంపెనీలు కూడా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించాలని విజ్ఞప్తిచేశారు.

- Advertisement -

మెరుగైన ఫలితాలు..


రాష్ట్రంలో ఇన్నోవేషన్‌ ఎకో సిస్టం వృద్ధిచేసేందుకు టీ-హబ్‌, టీఎస్‌ఐసీ, వీ-హబ్‌, రిచ్‌, టాస్క్‌, టీ-వర్క్స్‌, ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ వింగ్‌, ఇమేజ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటుచేశామని కేటీఆర్‌ తెలిపారు. మెంటార్‌షిప్‌, ఇంక్యుబేషన్‌, పరిశ్రమ అనుసంధానం విషయంలో 1,500 స్టార్టప్స్‌ మద్దతు పొందాయని చెప్పారు. ఐదేండ్లలో రూ.1,800 కోట్లు సమీకరించి పరిశ్రమ అవసరాలకు తగినట్టు టాస్క్‌ ద్వారా మూడు లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చామని తెలిపారు. ప్రభుత్వ మద్దతుతో నడుస్తూ దేశంలోనే అత్యధిక ప్లేస్‌మెంట్స్‌ రేట్‌ ఉన్న సెంటర్‌గా టాస్క్‌ నిలిచిందని వెల్లడించారు. మీ సేవ ద్వారా 500, టీ-యాప్‌ ద్వారా 250 ప్రభుత్వ సేవలను అందిస్తున్నామని చెప్పారు. మీ సేవ సేవల్లో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామన్నారు. ఈ-గవర్నెన్స్‌లో భాగంగా ప్రారంభించిన ఆర్టీడీఏఐ, డిజిటల్‌ వెరిఫికేషన్‌ సేవలు పలు అవార్డులు గెలుచుకొన్నాయని, ఎమర్జింగ్‌ టెక్నాలజీ వింగ్‌తో ఓపెన్‌ డాటా, బ్లాక్‌ చెయిన్‌, డాటా అనలటిక్స్‌, ఏఐ, సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ అడాప్షన్‌, ఈ-వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో సెక్టోరల్‌ పాలసీలు ప్రారంభించామన్నారు.

డబ్ల్యూఈఎఫ్‌, యూఎన్డీపీ, ప్రపంచబ్యాంకు వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకొని ఎమర్జింగ్‌ టెక్నాలజీ రంగంలో తెలంగాణను లీడర్‌గా నిలిపేందుకు కృషిచేస్తున్నామని చెప్పారు. డిజిటల్‌ తెలంగాణ ఆవిష్కరణలో భాగంగా హైదరాబాద్‌లో మూడువేల పబ్లిక్‌ వైఫై యాక్సెస్‌ పాయింట్లు ఏర్పాటుచేశామని, వీటిని ఇతర పట్టణాలకు కూడా విస్తరిస్తున్నామని తెలిపారు. ఐదు లక్షలమంది గ్రామీణులను డిజిటల్‌ లిటరేట్స్‌గా తీర్చిదిద్దామని కేటీఆర్‌ వివరించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు డిజిటల్‌ పాఠాలు నేర్పేందుకు చేపట్టిన డిజిటల్‌ లిటరసీ స్కీమ్‌లో ఉత్తమంగా పనిచేసిన విలేజ్‌ లెవల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ రత్లావత్‌ శంకర్‌ను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. గ్రామీణ ప్రాతాల్లో ఈ-కామర్స్‌ను ప్రోత్సహించేందుకు చేపట్టిన ‘గ్రామీణ్‌ ఈ స్టోర్‌’లో అత్యధిక అమ్మకాలు జరిపిన కొడికంటి వెంకన్నకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో యాక్సెంచర్‌ చైర్‌ పర్సన్‌ రేఖా మీనన్‌, యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ జోయిల్‌ రీఫ్‌మన్‌, సైయెంట్‌ ఫౌండర్‌ చైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి, టీసీఎస్‌ గ్లోబల్‌ హెడ్‌ వీ రాజన్న, ఐటీశా ఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫె న్‌ రవీంద్ర, టీఎస్‌టీఎస్‌ ఎండీ వెంకటేశ్వర్‌రావు, పలు ఐటీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఐసీటీ పాలసీ-2 విడుదల కార్యక్రమంలో ప్రభుత్వం పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకొన్నది. పలు నూతన కార్యక్రమాలు ప్రారంభించింది.

జాతీయ సగటు కంటే రెట్టింపు వృద్ధి
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటితో పోల్చితే ప్రస్తుతం ఐటీ ఎగుమతులు రెట్టింపు అయ్యాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. గతేడాది రాష్ట్రంలో రూ.1,45,522 కోట్ల ఎగుమతులు జరిగాయని, జాతీయ వృద్ధి రేటుతో పోల్చితే ఇది రెట్టింపు అని వివరించారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 2019-20లో 4.74% ఉంటే, 2020-21లో 5 శాతానికి పెరిగిందని వెల్లడించారు.

దేశ తలసరి ఆదాయం రూ.1.27 లక్షలుంటే, తెలంగాణలో రూ.2.27 లక్షలకు చేరిందని తెలిపారు. జనాభాలో 11వ స్థానంలో, విస్తీర్ణంలో 12వ స్థానంలో ఉన్న తెలంగాణ, జీడీపీ వాటాలో 4వ స్థానంలో ఉన్నదని వెల్లడించారు. గత ఆరేండ్లలో యాపిల్‌, ఫేస్‌బుక్‌, అమెజాన్‌, గూగుల్‌ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో కార్యాలయాలు ఏర్పాటుచేశాయని గుర్తుచేశారు. ప్రజలు జీవించేందుకు హైదరాబాద్‌ నగరం ఉత్తమమైనదని మెర్సర్‌, డైనమిక్‌ సిటీ అని జేఎల్‌ఎల్‌ సర్వేల్లో తేల్చాయని తెలిపారు. ఐటీ అంటే ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మాత్రమే కాదని, ఇంటెలిజెంట్‌ టెక్నాలజీ అని వ్యాఖ్యానించారు.

ఐటీకి తెలంగాణ మంచి భాగస్వామి
ఐటీ పరిశ్రమ వృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని, పరిశ్రమకు మంచి భాగస్వామిగా నిలుస్తున్నదని నాస్కాం, యాక్సెంచర్‌ చైర్‌పర్సన్‌ రేఖా మీనన్‌ ప్రశంసించారు. ఇక్కడి పురోగామి విధానాలు నూతన ప్రమాణాలుగా నిలుస్తుంటాయని, ఐటీ రంగం గణనీయ వృద్ధి వెనుక ప్రభుత్వ సరికొత్త ఆలోచనలు ఉన్నాయని కొనియాడారు. కరోనా సమయంలో నైట్‌ షిప్టులు, మినహాయింపులు, అత్యవసర సేవలకు ప్రభుత్వం మద్దతుగా నిలిచిందన్నారు. పరిశ్రమ కోణంలో టీ-ఏఐఎం, తెలంగాణ ఏఐ మిషన్‌తో నాస్కాం కలిసి పని చేస్తున్నదన్నారు. రాష్ట్రంలోని అతి పెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన యాక్సెంచర్‌.. ఐదు జిల్లాల్లో సీఎస్‌ఆర్‌ కింద సేవా కార్యక్రమాలు చేస్తున్నదని తెలిపారు. నిజామాబాద్‌లో 120 సీసీయూ బెడ్లను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
-నాస్కాం, యాక్సెంచర్‌ చైర్‌పర్సన్‌ రేఖా మీనన్‌

స్పష్టమైన విజన్‌ ఉన్న ప్రభుత్వమిది
తెలంగాణ ప్రభుత్వానికి అన్ని రంగ్లాలో స్పష్టమైన విజన్‌ ఉన్నదని, దానిని పక్కా ప్రణాళికతో అమలు చేసే (ఎగ్జిక్యూట్‌) సమర్ధత ఉన్నదని హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ జోయెల్‌ రీఫ్‌మన్‌ ప్రశంసించారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలోని ప్రభుత్వ యంత్రాంగానికి ఎలాంటి కొత్త సవాళ్లనైనా ధైర్యంగా స్వీకరించి పరిష్కరించే సామర్థ్యం ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఐటీ, ఆర్థిక సేవలు, ఐటీ ఆధారిత రంగాలు వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపారు. 2019 నుంచి 5.65 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడం, 1.10 లక్షల మందికి ఉపాధి కల్పించడం గొప్ప విషయమన్నారు. అమెరికాతో అత్యంత సాన్నిహిత్యం ఉన్న నగరం దేశంలో హైదరాబాద్‌ ఒక్కటేనని చెప్పారు.

 • యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ జోయెల్‌ రీఫ్‌మన్‌

కొత్త కార్యక్రమాలు
స్టార్టప్‌ల సేవలన్నీ ఒకే వేదిక మీదికి తెస్త్తూ రూపొందించిన ‘స్టార్టప్‌ తెలంగాణ పోర్టల్‌’ను ఆవిష్కరించారు.
రాష్ట్రంలో ‘నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆడిటివ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌’ (ఎన్సీఏఎం)ను ప్రారంభించనున్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీశాఖ (ఎంఈఐటీవై) కార్యదర్శి అజయ్‌ ప్రకాశ్‌ స్వాహ్నె ప్రకటించారు.
బీఎల్‌ఎస్‌ఐ/ఫ్యాబ్‌లెస్‌ చిప్‌ డిజైనింగ్‌లో స్టార్టప్‌లకు మద్దతుగా నిలిచేందుకు రూపొందించిన వర్చువల్‌ ప్లాట్‌ఫామ్‌ ‘టీ-ఫేస్‌’ (టీ-ఫ్యాబ్‌లెస్‌ యాక్సిలరేటర్‌ త్రూ క్లౌడ్‌ ఎనబ్లెమెంట్‌)ను ప్రారంభించారు.
స్టార్టప్‌లను ప్రారంభించేలా యువతను ప్రోత్సహించేందుకు ఇన్నొవేషన్‌ టు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ (ఐ2ఈ) ల్యాబ్‌ రెండో దశకు శ్రీకారం చుట్టారు. ఇది 14 వారాల కార్యక్రమం.

కీలక నిర్ణయాలు

 • భూయజమానులు, డెవలపర్లు వారి ఆధీనంలోని భూములకు ఐటీ పార్క్‌ హోదా పొందే అవకాశం. ఇది నాలుగు క్యాటగిరీలుగా ఉంటుంది. ఐటీ పార్కుల్లో ట్రాఫిక్‌ సమస్యలను తగ్గించడానికి ప్రస్తుతమున్న నిర్మాణ ప్రాంతాన్ని 66 నుంచి 60 శాతానికి తగ్గించి, పార్కింగ్‌ ఏరియాను 40 శాతానికి పెంచారు.
 • ఆరు ఇండస్ట్రియల్‌ పార్కుల ఏర్పాటుకు రెండువేల ఎకరాల భూమిని అందుబాటులోకి తీసుకురానున్నారు.
 • ఫేజ్‌-1లో ఐదు లక్షల చదరపు అడుగులు, పీపీపీ పద్ధతిలో 10 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని సిద్ధంగా ఉంచడం.
 • టాస్క్‌ ద్వారా శిక్షణతో రెండు లక్షల మందికి నైపుణ్యాలు పెంచడం.
 • విద్యాభ్యాసం పూర్తికాగానే పరిశ్రమల్లో చేరే నైపుణ్యాలతో మానవ వనరులను తీర్చిదిద్దటం. ఏటా 50 వేల మంది విద్యార్థులకు శిక్షణ. 80 శాతం పౌరులకు సైబర్‌ సెక్యూరిటీ, కృత్రిమ మేధ టెక్నాలజీపై అవగాహన పెంపొందించటం.
 • పౌరులు తమ సమస్యలను ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, ప్రభుత్వానికి ఆన్‌లైన్‌ ద్వారా తెలిపేందుకు జనహిత సిటిజన్‌ గ్రీవెన్స్‌ రిడ్రెస్సల్‌ ప్లాట్‌ఫాంను అందుబాటులోకి తేనున్నారు.
 • 2026 నాటికి టీ-ఫైబర్‌ పనులను 100 శాతం పూర్తిచేసి రాష్ట్రం మొత్తం 5జీ ఇంటర్‌నెట్‌ సేవలను విస్తరించటం.
 • ఇప్పటికే వెయ్యి పంచాయతీల్లో ఉన్న డిజిటల్‌ తెలంగాణ సెంటర్లను 12,765 గ్రామ పంచాయతీలకు విస్తరించడం.
 • ప్రతి ఇంటి నుంచి కనీసం ఒక్కరిలోనైనా డిజిటల్‌ లిటరసీ తీసుకురావాలి.
 • స్వయం సహాయక బృందాలు (ఎస్‌హెచ్‌జీ)ల్లో ఒకరిలో డిజిటల్‌ సామర్థ్యాన్ని పెంపొందించాలి.
 • త్వరలో తెలంగాణ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ (టీఈటీ) కారిడార్‌ ఏర్పాటు.
 • ప్రభుత్వ కార్యాలయాల్లో అంతర్గతంగా క్లౌడ్‌ కంప్యూటింగ్‌ టెక్నాలజీ ఉపయోగించడాన్ని తప్పనిసరి చేయటం.

ఒప్పందాలు
మైక్రోసాఫ్ట్‌తో..
క్లౌడ్‌, అనుబంధ టెక్నాలజీలపై రాష్ట్ర ఐటీశాఖ, మైక్రోసాఫ్ట్‌ మధ్య ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్‌ స్థానిక స్టార్టప్‌ ప్రోగ్రామ్‌లు, నైపుణ్య శిక్షణలో పాలుపంచుకొంటుంది. ‘తెలంగాణ ప్రభుత్వం, ప్రజలతో మా అనుబంధాన్ని కొనసాగిస్తుండటం, ప్రజల జీవన విధానాన్ని మార్చనున్న డిజిటల్‌ వసతుల కల్పనలో భాగస్వామి కావడం సంతోషంగా ఉన్నది’ అని మైక్రోసాఫ్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నవతేజ్‌ బాల్‌ అన్నారు.
యూఎన్డీపీతో..
డాటా ఫర్‌ పాలసీలో భాగంగా భవిష్యత్తు ఆహార వ్యవస్థలపై ‘నెక్ట్స్‌ జెన్‌ గొవ్‌’ (నెక్ట్స్‌ జనరేషన్‌ గవర్నమెంట్‌) చేస్తున్న ప్రయత్నంలో భాగస్వామి అయ్యేందుకు తెలంగాణ ప్రభుత్వం, యూఎన్డీపీ మధ్య ఒప్పందం కుదిరింది.
ఫెయిర్‌ ఫార్వర్డ్‌తో..
రాష్ట్రంలో కృత్రిమ మేధ టెక్నాలజీని మరింత ప్రోత్సహించేందుకు తెలంగాణ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ విభాగం, జర్మనీకి చెందిన ‘ఫెయిర్‌ ఫార్వర్డ్‌’ మధ్య ఒప్పందం కుదిరింది.
ఐసీఎఫ్‌ఏఐతో..
రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో విద్యార్థులకు మెరుగైన పాఠాలు అందించేందుకు టీ-శాట్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ ఫైనాన్షియల్‌ అనలిటిక్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఎఫ్‌ఏఐ) మధ్య ఒప్పందం కుదిరింది. ఐసీఎఫ్‌ఏఐ అధ్యాపక బృందం టీ-శాట్‌ ద్వారా పాఠాలు బోధిస్తారు.
మెంటార్‌ టుగెదర్‌తో..
విద్యార్థుల్లో ఉద్యోగ నైపుణ్యాలను పెంచేందుకు ‘మెంటార్‌ టుగెదర్‌’తో ఒప్పందం కుదిరింది.

ఐసీటీ పాలసీ-2

 • ఐటీ, ఐటీ ఉత్పత్తుల అభివృద్ధి, ఇంజినీరింగ్‌, పరిశోధన
 • ఎలక్ట్రానిక్స్‌, ఆవిష్కరణలు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌
 • స్కిల్లింగ్‌, అప్‌స్కిల్లింగ్‌ అండ్‌ రీ స్కిల్లింగ్‌
 • కాగితరహిత, భౌతిక హాజరు లేని పాలన అందించడం
 • డిజిటల్‌ మౌలికవసతులు
 • డిజిటల్‌ పరిజ్ఞానంలో పౌరుల సాధికారత
 • భవిష్యత్‌తరం సాంకేతికత
 • నగరజీవనానికి అవసరమైన టెక్నాలజీ
 • ఐటీఅండ్‌సీ డిపార్ట్‌మెంట్‌ టెక్‌ ఎనేబ్లర్‌

కంపెనీలకు ప్రోత్సాహకాలివీ

 • ప్రభుత్వ భూమి కేటాయింపు
 • విద్యుత్తు సౌకర్యం
 • ఐటీ పార్క్‌ హోదా కల్పన
 • క్వాలిటీ సర్టిఫికేషన్‌
 • రెంటల్‌ రిఫండ్‌
 • పరిశోధనలకు నిధులు
 • పెట్టుబడిపై రాయితీలు
 • ట్రైనింగ్‌ సబ్సిడీ
 • లీజ్‌ రెంటల్‌పై సబ్సిడీ
 • సహాయకుల నియామకం
 • సౌరవిద్యుత్తు పెట్టుబడిపై సబ్సిడీ
 • స్టాంప్‌ డ్యూటీ, ట్రాన్స్‌ఫర్‌
 • డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీ రాయితీ
 • సబ్సిడీపై వడ్డీ
 • తగ్గింపు ధరపై భూమి
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement