హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆడబిడ్డల పండుగ బతుకమ్మ విశ్వయవనికపై మురిసింది. ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతంలో, ప్రఖ్యాత దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో సొబగులు అద్దుకున్న ‘అల్లిపూల వెన్నెల’ బతుకమ్మ పాట విడుదలైంది. బతుకమ్మ ఆట, పాటను తెలంగాణ ఆత్మగౌరవ పతాకంగా లోకానికి పరిచయం చేసిన ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ పాటను రూపొందించారు.
హైదరాబాద్‌లోని తన నివాసంలో మంగళవారం దర్శకుడు గౌతమ్ మీనన్‌తో కలిసి ఎమ్మెల్సీ కవిత పాటను విడుదల చేశారు. ప్రసిద్ధ గాయని ఉత్తరా ఉన్నికృష్ణన్ ఆలపించిన ఈ పాటను తెలంగాణ ప్రముఖ రచయిత మిట్టపల్లి సురేందర్ రచించగా, జాతీయ అవార్డు గ్రహీత బ్రిందా కొరియోగ్రఫీ చేశారు. బుధవారం నుంచి తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తంగా ఘనంగా జరుగనున్నది. తెలంగాణ ఆడపడుచులు ఎంతో సంబురంగా చేసుకునే పండుగకు ‘అల్లిపూల వెన్నెల’ మరింత శోభ తీసుకురానున్నది. తెలంగాణలోని వివిధ లొకేషన్లలో ఈ పాటను ఎంతో అందంగా చిత్రీకరించారు. పాట విడుదల సందర్భంగా సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, ఎమ్మెల్సీ కవిత, దర్శకుడు గౌతమ్ మీనన్ ట్వీట్స్ చేశారు.
రంగులు, మెలోడీ, ఐక్యతకు చిహ్నమైన బతుకమ్మ ఇక్కడ ఉంది. నా సోదరీమణుల కోసం ఏఆర్ రెహమాన్, గౌతమ్ మీనన్, ఓ కలల బృందం అందించిన ప్రత్యేక పాట ‘అల్లిపూల వెన్నెల’ను మీతో పంచుకుంటున్నా.
అందరు ఆడి పాడుకునే మట్టి మనుషుల పండుగ కోసం మా మనసులో భావాలకు మా హృదయ స్వరాలని కూర్చి ఒక పాటగా పేర్చి మేము అందిస్తున్న చిన్నకానుక