సిద్దిపేట, జూలై 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ఇల్లందకుంట/వీణవంక: ఈటల రాజేందర్ తన ఆస్తులను కాపాడుకునేందుకు బీజేపీలో చేరి తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసుకున్నాడని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని మరిచిన ఈటల తన సంపదను పెంచుకున్నాడని విమర్శించారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం రాచపల్లికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల యూత్ నాయకులు రెండు వందల మంది ఆదివారం సిద్దిపేటలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. అలాగే వీణవంక మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన ముగ్గురు వార్డు సభ్యులు భిక్షపతి, తిప్పని అజయ్, ఉడుత ఐలయ్యతోపాటు మరో 22 మంది కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరగా మంత్రి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సహకారంతో హుజూరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని మంత్రి తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న వివిధ పథకాలను పక్క రాష్ర్టాల వారు చూసి అమలు చేస్తున్నారని చెప్పారు. కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలను ఆపలేదన్నారు. చినుకు పడకముందే రైతుబంధును రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. సమైక్య ప్రభుత్వాల హయాంలో ఎరువులు కావాలన్నా, విత్తనాలు కావాలన్నా క్యూ లైన్లో రైతులు నిల్చున్న రోజులను గుర్తుచేశారు. ఇప్పుడు రైతులకు అలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు.
సీఎం కేసీఆర్ వెంటే ఉంటాం
ఇల్లందకుంట, వీణవంక మండలాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా మాట్లాడుతూ.. తామంతా సీఎం కేసీఆర్ వెంటే ఉంటామని ప్రకటించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. అభివృద్ధిని కాంక్షించే తాము టీఆర్ఎస్లో చేరినట్టు తెలిపారు. ఈటల రాజేందర్ అభివృద్ధిని మరిచి ఆస్తులను పెంచుకున్నారని వారు ఆరోపించారు.