పారిస్ : ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో అలెగ్జాండర్ జ్వెరెవ్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో జ్వెరెవ్ 7-5, 6-2, 3-6, 6-3తో యాకుబ్ మెన్సెక్(చెక్ రిపబ్లిక్)పై అద్భుత విజయం సాధించాడు. మూడు గంటల పాటు సాగిన పోరులో జ్వెరెవ్ తనదైన శైలిలో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాడు. టోర్నీలో నిలకడగా ఆడుతున్న ఈ జర్మన్ ప్లేయర్..సెట్ సెట్‌కు తన ఆటతీరును మెరుగుపర్చుకుంటూ తుదిపోరుకు అర్హత దక్కించుకున్నాడు. తొలి సెట్ నుంచే ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఓవైపు జ్వెరెవ్ పదునైన సర్వ్‌లతో చెలరేగితే మరోవైపు 18 ఏండ్ల యాకుబ్ అంతే దీటుగా బదులిచ్చాడు. దీంతో ఓ దశలో 5-5తో సెట్ సమమైన సమయంలో మెన్సెక్ అవకాశాలను దుర్వినియోగం చేసుకున్నాడు. మూడు బ్రేక్ పాయింట్లను కాపాడుకోవడంలో మెన్సెక్ విఫలం కావడం, అదే సమయంలో జ్వెరెవ్ ఒత్తిడిని అధిగమిస్తూ 7-5తో సెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
రెండో సెట్లో ఏ మాత్రం వెనుకకు తగ్గని జ్వెరెవ్.. దాన్నీ దక్కించుకున్నాడు. అయితే మూడో సెట్లో ఒక్కసారిగా పుంజుకున్న మెన్సెక్.. జ్వెరెవ్‌కు ఝలక్ ఇచ్చాడు. తన శక్తినంతా కూడదీసుకుంటూ జ్వెరెవ్‌కు చెమటలు పట్టించిన మెన్సెక్ 6-3తో సెట్ కైవసం చేసుకోవడం పోరు ఆసక్తికరంగా మారింది. పోటీ తీవ్రతను గమనించిన జ్వెరెవ్.. 2-0తో ఆధిక్యం కనబరిచి అదే దూకుడు కనబరుస్తూ 3-0, 4-2తో సెట్‌తో పాటు మ్యాచ్‌ను తన వైపునకు తిప్పుకున్నాడు. మ్యాచ్‌లో జ్వెరెవ్ 8 ఏస్‌లు సంధిస్తే మెన్సెక్ నాలుగుకు పరిమితమయ్యాడు. ఐదు సార్లు డబుల్‌ఫాల్ట్స్ చేయడం మెన్సెక్ కొంపముంచగా, జ్వెరెవ్ రెండుతో సరిపెట్టుకున్నాడు. 7 బ్రేక్ పాయింట్లలో జ్వెరెవ్ 4 కాపాడుకుంటే మెన్సెక్కు 4లో ఒకటే దక్కింది.