దేవరుప్పుల, సెప్టెంబర్ 12 : ఓ వైపు ట్రాన్స్ కో వినియోగదారులకు జీరో బిల్లులు పంపుతూనే మరోవైపు ఎరియర్స్ పేర వేల రూపాయలు బకాయిలు ఉన్నారని, అవి కట్టాలంటూ బలవంతం చేస్తున్నారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రతి ఇంటికీ 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తామని ప్రకటించింది. కొద్ది నెలల నుంచి కొందరికి జీరో బిల్లు అమలవుతున్నది. ఇంతలోనే విద్యుత్ శాఖకు కొత్త ఆలోచన వచ్చింది. జీరో బిల్లు వస్తున్న వారంతా ఎరియర్స్ పేర వేలాది రూపాయలు కట్టాలని బిల్లులు పంపుతున్నారు. పైన జీరో బిల్లు చూపుతూనే కింద ఎరియర్స్ బాకీ చూపుతున్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలవ్యాప్తంగా వందలాది మంది జీరో వినియోగదారులకు వేలాది రూపాయలు ఎరియర్స్ పేర బకాయిలు చూపడం చర్చనీయాంశమైంది. నెలల కొద్ది జీరో బిల్లులు పంపి తీరా వేలాది రూపాయలు బకాయిలు ఉన్నట్టు పంపడం తగదని, తాము గతంలో చెల్లించిన నెలవారీ బిల్లులు కూడా ఇంత రాదని వినియోగదారులు వాపోతున్నారు.