హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ) : ప్రారంభానికి ముందే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ యూనిట్-1 రికార్డులు సృష్టిస్తున్నది. 2025-26లో అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్(పీఎల్ఎఫ్)తో టాప్‌లో (77.56శాతం)నిలిచింది. ఆ తర్వాత 75.90శాతం పీఎల్‌ఎఫ్‌తో కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్ యూనిట్-2 రెండోస్థానంలో, 71.37 శాతం పీఎల్‌ఎఫ్‌తో బీటీపీఎస్-4 యూనిట్ మూడోస్థానం లో నిలిచాయి. విద్యుత్తు ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పీఎల్‌ఎఫ్‌గా పిలుస్తారు. రాష్ట్రంలో మొత్తం 12 థర్మల్‌ప్లాంట్లు ఉండగా, ప్రస్తుతం 10 యూ నిట్లు నడుస్తున్నాయి. రెండు యూనిట్లు ఓవరాలింగ్(మరమ్మతులు)జరుగుతున్నాయి. వైటీపీఎస్‌లో మొత్తం 2 యూనిట్లుండగా.. ప్రస్తుతం 800 మెగావాట్ల యూనిట్-2 అందుబాటులోకి వచ్చింది. మరో 800 మెగావాట్ల సామర్థ్యం గల యూనిట్ -1లో ఈ నెల 12న కమిషనింగ్ ఆఫ్ డేట్(సీవోడీ)విజయవంతమైన విషయం తెలిపిందే. 72 గంటలపాటు నిరంతరాయంగా నిర్వహించిన ఈ సీవోడీలో 800 మెగావాట్లకు 814 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అయ్యింది. బాయిలర్ లైటప్, ట్ర యల్స్, సీవోడీ వరకు యూనిట్-1 అత్యధిక పీఎల్‌ఎఫ్‌ను నమోదుచేసింది.
ఆరోపణలు చేసినోళ్లే ప్రారంభం..
ట్రయల్స్, సీవోడీ విజయవంతం కావడంతో వైటీపీఎస్ యూనిట్-1ను వారం, పదిరోజుల్లో ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. వైటీపీఎస్పై గతంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా పలువురు కాంగ్రెస్ నేతలు పలు ఆరోపణలు చేశారు. ఇప్పుడు వారే ఈ ప్లాంట్లను ప్రారంభిస్తుండటం గమనార్హం.