YS Jagan | హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొనియాడారు. హైదరాబాద్‌లో సచివాలయాన్ని అతితక్కువ ఖర్చుతో, ఎక్కువ మందికి ఉపయోగపడేలా నిర్మించారని ప్రశంసించారు. కేసీఆర్ హైదరాబాద్‌లో 8.58 లక్షల చదరపు అడుగులలో రూ.616 కోట్లతో సచివాలయాన్ని అద్భుతంగా నిర్మించారని పేర్కొన్నారు. సచివాలయంలోకి అన్ని విభాగాలు షిఫ్ట్ అయ్యాయని గుర్తుచేశారు.
గురువారం ఏపీలోని తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ కట్టించిన తెలంగాణ సచివాలయ విస్తీర్ణం, అయిన ఖర్చు వివరాలను ప్రదర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిలో 53.57లక్షల చదరపు అడుగులలో సచివాలయం నిర్మిస్తానని చెప్పడమేంటని ఎద్దేవా చేశారు. అమరావతి టెండర్ల పేరుతో చంద్రబాబు దోపిడీకి తెరతీశారని ధ్వజమెత్తారు.
హైదరాబాద్, బెంగళూరులో ఫైవ్‌స్టార్ లాబీలు గల అపార్ట్మెంట్ల కోసం స్కేర్ ఫీట్‌కు రూ.4వేలు ఖర్చవుతుందని, అమరావతిలో స్కేర్ ఫీట్‌కు రూ.8,900 ఎలా ఖర్చవుతుందని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు రూ.600 కోట్లు ఖర్చు చేసి శాసనసభ, సచివాలయం నిర్మించారని, మళ్లీ కొత్త సచివాలయం కడతామని చెప్పడమేంటని నిలదీశారు. అమరావతి సెల్ఫ్‌ఫైనాన్స్ మాడల్ అంటూ ప్రజలను చంద్రబాబు మభ్యపెడుతున్నారని, రాజధాని పేరుతో చేస్తున్న అప్పులు ఆకాశాన్ని అంటుతున్నాయని మండిపడ్డారు.