హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): ఓ తండ్రి, కూతురు ఆడుకుంటున్న వీడియోపై నీచమైన కామెంట్లు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హన్మంతును పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అమెరికాకు పారిపోతుండగా బెంగళూరులో అతడిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రణీత్‌ను త్వరలో బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తీసుకురానున్నట్టు తెలిసింది. అతనిపై ఇప్పటికే పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ప్రణీత్, డల్లాస్ నాగేశ్వర్రావు, మరో ఇద్దరు కలిసి ‘డార్క్ కామెడీ’ పేరుతో ఓ తండ్రీ-కూతురు వీడియోపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసి శునకానందం పొందారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తొలుత నటుడు సాయిధరమ్ తేజ్ స్పందించారు. ‘సోషల్ మీడియాలో మృగాలు ఎకువైపోయాయి. పిల్లల వీడియోలను సోషల్ మీడియాలో పెట్టేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి’ అంటూ ఆయన ఓ పోస్టు పెట్టారు. ప్రణీత్‌పై చర్యలు తీసుకోవాలని టాలీవుడ్ నటులు మంచు మనోజ్, విశ్వక్సేన్, అడివిశేష్, కార్తికేయ, సుధీర్‌బాబు సహా పలువురు ఏపీ, టీజీ ప్రభుత్వాలను కోరారు. ఈ నేపథ్యంలో ప్రణీత్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. మిగతా ముగ్గురిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు.
ప్రణీత్ రూపొందించిన వీడియోపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ‘సారీ’ అంటూ ఆయన సింపుల్‌గా ఓ వీడియో రిలీజ్ చేశాడు. దీంతో ‘అరాచకంగా మాట్లాడి సారీ చెప్తే సరిపోతుందా?’ అని నెటిజన్లు నిలదీస్తున్నారు. ఐఏఎస్ అధికారి అరుణ్‌కుమార్ తనయుడు ప్రణీత్ తనయుడైన ప్రణీత్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లలో ఒకడు. రోస్ట్ వీడియోలు చేస్తూ పాపులర్ అయ్యాడు. అతని చానల్‌కు లక్షకుపైగా ఫాలోవర్స్ ఉన్నారు. ప్రణీత్ అన్నయ్య అజయ్ హనుమంతు కూడా యూట్యూబరే. ైస్టెలిష్ టిప్స్‌తో పాపులర్ అయిన ‘ఏ జూడ్’ చానల్‌ను ఆయన నడిపిస్తున్నాడు.
ప్రభుత్వ నియంత్రణ లేకపోవడమే కారణం
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 10 (నమస్తే తెలంగాణ): సమాచార వ్యాప్తికి, సామాజిక వికాసానికి దోహదపడాల్సిన సోషల్ మీడియా అనైతికతకు అడ్డాగా మారింది. దీన్ని అదుపు చేయడంలో పాలకులు విఫలమవుతుండటంతో ఎంతో మంది రెచ్చిపోతున్నారు. గిట్టనివారిపై యూట్యూబ్, ఎక్స్, ఫేస్బుక్, వాట్సాప్ మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు చేయడంతో హత్యలకు, ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. తండ్రి, బిడ్డకు సంబంధించిన ఓ వీడియోపై ఇటీవల యూట్యూబర్ ప్రణీత్ కామెంట్లపై సభ్యసమాజం భగ్గుమంటున్నది. అతడిపై బెంగుళూరు, తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల బేగంపేటలో ఉస్మాన్ హత్యకూ సోషల్ మీడియా కామెంట్లే కారణమయ్యాయి. తనకు ఇష్టమైన యువతితో పెండ్లి చేసేందుకు ఆమె కుటుంబసభ్యులు నిరాకరించడంతో ఉస్మాన్ స్నాప్‌చాట్‌లో నకిలీ అకౌంట్ తెరిచి, యువతిపై తప్పుడు ప్రచారం చేశాడు. దీంతో ఆ యువతి మామ, మరికొందరు కలిసి ఉస్మాన్‌ను హతమార్చారు. నిరుడు జల్పల్లి మున్సిపల్ చైర్మన్ వర్గీయులకు వ్యతిరేకంగా ఓ మాజీ రౌడీషీటర్ వీడియోలను పోస్టు చేయడంతో ఆయనను హత్య చేశారు.
కొందరు విదేశాల్లో ఉండి సోషల్ మీడియాలో అభ్యంతకర పోస్టులు పెడుతూ ప్రజల మధ్య ద్వేషాలను రెచ్చగొడుతున్నారు. ప్రభుత్వానికి నియంత్రణ లేకపోవడంతో పగలు, ప్రతీకారాలను తీర్చుకునేందుకు సోషల్ మీడియాను వేదికగా వాడుకొంటున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లంతా నిబంధనలను పాటించేలా చూడాలని, చట్టాలను ఉల్లంఘిస్తే శిక్షలకు గురికాక తప్పదన్న భయం కల్పించేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.