హైదరాబాద్ జూన్ 23 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో మలేషియా జైలు నుంచి మరో ముగ్గురికి విముక్తి లభించింది. ఆరుగురు బాధితుల్లో గతంలో ముగ్గురు విడుదలై స్వదేశానికి రాగా, సోమవారం మరో ముగ్గురు యువకులు సొంతూర్లకు చేరుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కడెం లింగాపూర్‌కు చెందిన రాచకొండ నరేశ్, గుండా శ్రీనివాస్, దస్తురాబాద్ మున్యాల్ గ్రామానికి చెందిన రవీందర్‌తోపాటు మరో ముగ్గురు చేయని తప్పుకు మలేషియాలోని జైలులో మగ్గారు. ఖానాపూర్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి జాన్సన్ నాయక్ వారి దయనీయ పరిస్థితిని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే స్పందించి అక్కడి ఎంబసీ అధికారులతో మాట్లాడారు. అలాగే పార్టీ లాయర్ల ద్వారా న్యాయసహాయం అందించి, గత నెలలో జాన్సన్ నాయక్‌ను మలేషియాకు పంపించారు. జాన్సన్‌నాయక్ మలేషియా, భారత రాయబార కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరిపారు. పలుమార్లు ఆయన విజ్ఞప్తి చేయగా అక్కడి జైలు అధికారులు విడుదలకు ఒప్పుకున్నారు. ఈ క్రమంలో గత నెలలో ముగ్గురు విడుదల కాగా, తాజాగా మరో ముగ్గురు సొంతూర్లకు చేరుకున్నారు.
బతికినంతకాలం రుణపడి ఉంటాం..
మలేషియా జైలు నుంచి విడుదలై సొంతూర్లకు చేరుకున్న రాచకొండ నరేశ్, గుండా శ్రీనివాస్, రవీందర్ భావోద్వేగానికి గురయ్యారు. దేశంకానీ దేశంలో అష్టకష్టాలు పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మలేషియాలోనే జీవితం అంతమైపోతుందని భావించిన మాకు కేటీఆర్, జాన్సన్‌నాయక్ అండగా నిలిచారు.. న్యాయవాదులను నియమించి మా దగ్గరకు వచ్చి విడిపించారు’ అని తెలిపారు. బతికినంతకాలం వారికి రుణపడి ఉంటామని మనసారా కృతజ్ఞతలు తెలిపారు.