జనగామ, మే 18 (నమస్తే తెలంగాణ) : రూ. 20 లక్షల అప్పుకోసం తనకు బలవంతంగా వివాహం చేశారని ఆరోపిస్తూ జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కేంద్రానికి చెందిన ఓ యువతి హైదరాబాద్‌లో మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. నర్మెట మండలం కన్నెబోయినగూడేనికి చెందిన రాకేశ్‌గౌడ్ కుటుంబం కొన్నేండ్లుగా బచ్చన్నపేటలో స్థిరపడ్డారు. రాకేశ్‌గౌడ్ మొదటి భార్య కుమార్తె లహరికి నిరుడు నవంబర్‌లో పెండ్లి నిశ్చయమైన తర్వాత మైనర్ అని వివాహం ఆగిపోయింది.
ఈ నెల 8న జనగామ మండలం పెంబర్తికి చెందిన ఆవుల ప్రశాంత్‌రెడ్డితో లింగాలఘనపురం మండలం జీడికల్ ఆలయంలో వివాహం జరిగింది. ఆ మరుసటి రోజే మే 9న యువతి ఇంట్లో నుంచి పారిపోయింది. దీనిపై జనగామ పోలీస్‌స్టేషన్‌లో ప్రశాంత్‌రెడ్డి బంధువులు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదైంది. కాగా రూ. 20 లక్షల అప్పు కోసం తన తండ్రి, పినతల్లి కలిసి తనకు 45 ఏండ్ల వ్యక్తితో బలవంతగా పెండ్లి చేశారని మహిళా కమిషన్, డీజీపీకి యువతి ఫిర్యాదు చేసింది.