హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): ఏపీలోని నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపత్రి గ్రామంలో దారుణం చోటుచేసుకున్నది. తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదనే కక్షతో యువతిని ఓ ఉన్మాది తుపాకీతో కాల్చిచంపాడు. ఆ తర్వాత తానూ కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం పొదలకూరు మండలం తాటిపర్తికి చెందిన మాలపాటి సురేశ్‌రెడ్డి బెంగళూరులో, పొలకూరు కావ్య పూణెలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. కొంతకాలంగా వీరు ప్రేమించుకుంటున్నారు. ఉద్యోగరీత్యా వీరిద్దరూ గతంలో బెంగళూరు, పూణెలో ఉండేవారు. ప్రస్తుతం వర్క్‌ఫ్రమ్ కావడంతో స్వగ్రామం తాటిపర్తి నుంచే రెండేండ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. సురేశ్, కావ్య ప్రేమ విషయం ఇటీవల ఇంట్లో తెలిసింది. కావ్యను పెళ్లిచేసుకుంటానని కొంతకాలంగా సురేశ్‌రెడ్డి అడుగుతుండగా, అందుకు కావ్య కుటుంబసభ్యులు అంగీకరించలేదు.
సోమవారం సురేశ్ తుపాకీతో వెళ్లి కావ్యపై కాల్పులు జరిపాడు. ఆపై తానూ తలపై కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రక్తపు మడుగులో కొన ఊపిరితో ఉన్న కావ్యను స్థానికులు 108 వాహనంలో నెల్లూరు దవాఖానకు తరలించగా మార్గమధ్యంలో ఆమె మృతిచెందింది. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలిని పరిశీలించారు. ప్రేమించిన యువతిపై సురేశ్ కాల్పులు జరుపడానికి కారణాలేమిటి? సురేశ్‌రెడ్డికి తుపాకీ ఎక్కడ లభించిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.