మంథని, జూన్ 21: పోలీస్ కేసు.. వారి దెబ్బలకు భయపడి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నంచేసి అచేతనస్థితిలోకి వెళ్లిపోవడంతో అతడి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. తమ కొడుకుకు ఇలాంటి దుస్థితి తెచ్చిన వారిపై చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అచేతనస్థితిలో ఉన్న యువకుడిని అంబులెన్స్‌లోనే ఉంచి అతడి తల్లిదండ్రులు, స్థానికులు శనివారం పెద్దపల్లి జిల్లా మంథని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేశారు.
బాధితుడి తల్లిదండ్రులు చీరం రాజేశ్వరి-దేవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. గత వానకాలం సీజన్లో శ్రీపాద కాలనీలోని కొనుగోలు కేంద్రం వద్ద హమాలీ కార్మికులతో గొడవ పాల్పడుతున్నాడంటూ కొంతమంది తమ కొడుకు రాజ్‌కుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఎస్ఐ, కానిస్టేబుళ్లు తమ కొడుకును పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి, అకారణంగా కేసు నమోదు చేయడంతో మనస్తాపానికి గురై ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు యత్నించగా కరీంనగర్, హైదరాబాద్ దవాఖానలకు తీసుకెళ్లామని చెప్పారు. కోమాలో ఉంటూ అచేతన స్థితిలో మంచానికే పరిమితయ్యాడని వాపోయారు.
చేతికందొచ్చిన కొడుకును మంచానికి పరిమితం చేసిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా పట్టించుకోవడం లేదని చెప్పారు. దీంతో తమ కొడుకును అంబులెన్స్‌లో తీసుకొచ్చి న్యాయం జరగాలని కోరుతూ ధర్నాకు దిగినట్టు వెల్లడించారు. ఎస్ఐ, కానిస్టేబుళ్లు, మాజీ కౌన్సిలర్, హమాలీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. సీఐ రాజు, కాంగ్రెస్ నాయకులు చేరుకొని న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు.