ఇల్లంతకుంట రూరల్, నవంబర్ 19: కారుకు సైడ్ ఇవ్వలేదని ఓ యవకుడు ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేశాడు. ప్రయాణికులు వద్దని చెబుతున్నా వినిపించుకోకుండా చితకబాదాడు. వివరాల్లోకి వెళితే.. సిరిసిల్లకు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బుధవారం సాయంత్రం ఇల్లంతకుంట నుంచి సిరిసిల్లకు వెళ్తున్నది. మార్గమధ్యలో వల్లంపట్ల వద్ద సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం గంగాపూర్‌కు చెందిన పిట్టల శ్రీకాంత్ తన కారుకు బస్సు డ్రైవర్ సైడ్ ఇవ్వలేదని ఆగ్రహించాడు. వల్లంపట్ట హనుమాన్ గుడి వద్ద కారును బస్సుకు అడ్డంగా నిలిపాడు. తర్వాత బస్సులోకి వెళ్లి డ్రైవర్ బాలరాజుపై దాడిచేశాడు. ప్రయాణికులు వారించినా వినిపించుకోకుండా చితకబాదాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌కాగా, ఆర్టీసీ డ్రైవర్‌పై దాడిని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. ఆర్టీసీ ఉద్యోగిపై దాడి చేయడం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే ఎస్పీ మహేశ్‌కు ఫోన్ చేసి, దాడి ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సూచించారు. బస్సు డ్రైవర్ బాలరాజు ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా దాడికి పాల్పడ్డాడని కారు డ్రైవర్‌పై ఫిర్యాదు చేశాడు.