తాడ్వాయి, జూలై 11: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర అభివృద్ధి పేరుతో తమ భూములు లాక్కుంటే ఊరుకోబోమని మేడారానికి చెందిన యువ రైతులు హెచ్చరించారు. జాతర అభివృద్ధిలో భాగంగా భూ సేకరణకు గురువారం మేడారంలోని ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో ఆర్డీవో వెంకటేశ్ రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కొంతమంది రైతులు మాత్రమే హాజరయ్యారు.
జాతర అభివృద్ధిలో భాగంగా భక్తులకు షెడ్లు, గదుల నిర్మాణంతోపాటు పలు సౌకర్యాలు కల్పిస్తామని, భూము లు ఇవ్వాలని రైతులను కోరగా, తమకున్న కొద్దిపాటి భూములను అభివృద్ధి పేర తీసుకుంటే ఎలా బతకాలని ప్రశ్నించారు. భూములు ఇస్తే లబ్ధి చేసేలా చర్యలు తీసుకుంటామని ఆర్డీ వో చెప్పినా రైతులు వినలేదు. దీంతో ఆర్డీవో మరోసారి సమావేశం నిర్వహిస్తామని చెప్పి వెళ్లిపోయారు.