Sangareddy | సిర్గాపూర్, అక్టోబర్ 13 : గతంలో సర్కారు ఇచ్చిన భూమిని తిరిగి తీసుకుంటే తాను ఎలా బతికేది? అంటూ యువ రైతు విద్యుత్తు స్తంభం ఎక్కి ఆందోళన చేపట్టాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం వాసర్ వాలునాయక్ తండాలో ఆదివారం చోటుచేసుకున్నది. గ్రామ శివారులోని 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పేరుతో గతంలో గిరిజనులకు ఇచ్చిన భూములను తిరిగి తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తండాకు చెందిన బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు.
ఈ క్రమంలో చౌహాన్ రాజు అనే యువ రైతు ఏకంగా విద్యుత్తు స్తంభం ఎక్కి నిరసన తెలిపాడు. ‘నా భూమి పోతుంది.. నేను ఎట్లా బతికేది?’ అంటూ ఆవేదనతో ఆత్మహత్యకు యత్నించాడు. కొందరు స్థానికులు చాకచక్యంతో రాజును సముదాయించి కిందకు దింపారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డితో మాట్లాడి నష్టపరిహారం డిమాండ్ చేద్దామని తండా వాసులు చెప్పి ఆయన్ను శాంతింపజేశారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించాలని లేకపోతే ఆందోళన చేస్తామని తండాకు చెందిన బాధిత రైతులు హెచ్చరించారు.