B.Tech | హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : మూడేండ్లల్లోనే బీటెక్ పూర్తి చేయొచ్చు. ఆరో సెమిస్టర్ లేదంటే ఏడో సెమిస్టర్‌లోనే పూర్తిచేసుకోవచ్చు. ఈ సమయానికి 160 క్రెడిట్స్‌ను పొందాల్సి ఉంటుంది. మిగిలిన కాలాన్ని ఇండస్ట్రియల్ ఇంటర్న్‌షిప్/ప్రాజెక్ట్ రూపంలో పూర్తిచేయాలి. ఇలాంటి సంస్కరణలు వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేసేందుకు, బీటెక్ కోర్సుల సిలబస్‌ను మార్చేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఏఐసీటీఈ మాడల్ కరిక్యులాన్ని పరిగణనలోకి తీసుకుని కొత్త కరిక్యులాన్ని రూపొందిస్తున్నది. మండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ అధ్యక్షతన ఐదుగురు సభ్యులతో కూడిన నిపుణల కమిటీ శుక్రవారం ప్రతిపాదనలు చేసింది.