పెద్దపల్లి, జూన్ 6: రాబోయే 20 ఏండ్ల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికబద్ధంగా పట్టణ సమగ్ర అభివృద్ది కోసం పెద్దపల్లి (Peddapalli) మాస్టర్ ప్లాన్ రూపొందించారు. 2019 ఏప్రిల్ 12న డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ అప్రూవల్ కాగా, ఫైనల్ అప్రూవల్ రాలేదని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టకుండా కేవలం ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపులకు మాత్రమే అమలు చేయటం పట్ల సర్వత్ర విమర్శలు వెల్లువెతున్నాయి. పెద్దపల్లి పట్టణ పరిధి సరిహద్దు చుట్టూ 200 ఫీట్ల వెడల్పుతో రింగ్ రోడ్డును ఏర్పాటు చేశారు. ఆ రోడ్డులో ఎఫెక్ట్ అయ్యే సర్వే నంబర్లోని మొత్తం భూమిని ప్రొహిబిటెడ్ జాబితాలో పెట్టడంతో వందలాది ప్లాట్స్ క్రమబద్ధీకరణకు నోచుకొని దుస్థుతి ఏర్పడింది. పెద్దపల్లి మున్సిపాలిటీకి మాస్టర్ ప్లాన్ ఉన్నట్టా? లేనట్టా? అనే గందరగోళ పరిస్థితి నెలకొంది.
పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ వద్ద రాజీవ్ రహదారి వద్ద నుంచి రింగ్ రోడ్డు ప్రారంభమై పెద్దపల్లి మండలంలోని పెద్దకల్వల, నిమ్మనపల్లి, నిట్టూరు, తుర్కలమద్దికుంట, బొంపెల్లి, బంధంపల్లి, అప్పన్నపేట, గొల్లపల్లి, రాఘవపూర్, గౌరెడ్డిపేట, హన్మంతునిపేట, రాంపెల్లి, చీకురాయి, కొత్తపల్లి, పెద్దబొంకూరి గ్రామాల శివారులను కలుపుతూ పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో 200ఫీట్ల వెడల్పుతో రింగ్ రోడ్డును నిర్మించాలని మాస్టర్ ప్లాన్‌లో పొందుపరుచారు.
రింగ్ రోడ్డు పరిధిలో ప్లాట్లు ప్రొహిబిటెడ్ జాబితాలో ఉన్నాయని మున్సిపల్ అధికారులు క్రమబద్ధీకరించటం లేదు. దీంతో ప్లాట్ ఓనర్లు మూడు నెలలుగా మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అసలు రింగ్ ఉందనే విషయమే మాకు తెలియదని, ప్రజాభిప్రాయసేకరణ చేయలేదని సదరు ప్లాట్ యజమానులు ఆరోపిస్తున్నారు. 2019లో డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ అప్రూవల్ వస్తే 6 సంవత్సరాలు గడిచిన ఫైనల్ మాస్టర్ ప్లాన్ ఎందుకు అప్రూవల్ కాలేదని ప్రశ్నిస్తున్నారు. డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
పెద్దపల్లికి మాస్టర్ ప్లాన్ ఉందా? ఉంటే దాని ప్రకారం అభివృద్ధి జరుగుతుందా? 200 ఫీట్ల వెడల్పు గల రింగ్ రోడ్డు పరిధిలో కొన్ని నూతన భవనాలు నిర్మాణాలు జరుగుతున్నాయని, వాటికి ఎవరు, ఎట్లా అనుమతులు ఇచ్చారో చెప్పాలని మున్సిపల్ అధికారులను అడిగితే మా హయంలో మాస్టర్ ప్లాన్ తమ హయంలో రూపొందించబడేలేదని, మేము అనుమతి ఇవ్వలేదని ప్రస్తుత అధికారులు చెబుతున్నట్లు బాధిత ప్లాట్ యజమానులు వాపోతున్నారు. రింగ్ రోడ్డులో ఎఫెక్ట్ అయ్యే స్థలంలో కూడా నూతన భవనాలు నిర్మాణం అవుతున్న పట్టించుకోని అధికారులు….కేవలం ఎల్ఆర్ఎస్కు మాత్రమే మాస్టర్ ప్లాన్ తెర మీదకి తేవటం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
2019 ఏప్రిల్ 12న డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ అప్రూవల్ అయిందని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేశ్ అన్నారు. ఇంకా ఫైనల్ అప్రూవల్ రాలేదని చెప్పారు. డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్‌లో 200 ఫీట్ల రింగ్ రోడ్డు ఉంది. ఆ రోడ్డులో ఎఫెక్ట్ అయ్యే సర్వే నంబర్లలోని ప్లాట్స్‌ను క్రమబద్ధీకరించటం లేదని తెలిపారు.