ఎల్లారెడ్డిపేట, జూలై 13: పది రోజులుగా వానలు ముఖం చాటేయడం.. బోరుబావులతో సాగు చేద్దామనుకుంటే కరెంటు రాకపోవడంతో రైతులు ఆందోళన బాటపట్టారు. కరెంటు సమస్యను అధికారులకు విన్నవించి విసుగెత్తిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ రైతులు ఆదివారం ట్రాన్స్ఫార్మర్ వద్ద నిరసనకు దిగారు. మూడు రోజుల క్రితం గ్రామ శివారులోని ఓ ట్రాన్స్ఫార్మర్ చెడిపోయిందని, దానికి 23 మోటర్లు ఉండగా, సుమారు 60ఎకరాల ఆయకట్టు ఉన్నదని తెలిపారు. వర్షం తక్కువగా పడటంతో బోరు బావి నీళ్లతో దున్నకం మొదలు పెట్టినట్టు వారు పేర్కొన్నారు. కరెంటు ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని అయోమయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. కండ్లముందు నీళ్లు లేక మడి ఎండిపోతుంటే చూడలేక ఆదివారం నిరసనకు దిగినట్టు వారు తెలిపారు. వెంటనే ట్రాన్స్ఫార్మర్ను మరమ్మతు చేయించి పంటలను కాపాడాలని కోరారు. ఏఈ పృథ్వీని వివరణ కోరగా ట్రాన్స్ఫార్మర్ శనివారమే చెడిపోయిందని సోమవారం తెప్పించి బిగిస్తామని సమాధానమిచ్చారు.
మళ్లీ మళ్లీ దున్నాల్సి వస్తంది..
మూడు రోజుల కిందట ట్రాన్స్ఫార్మర్ కరాబైంది. అప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నం. హెల్పర్‌కు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ చేసిండు. అధికారులు స్పందిస్తలేరు. మొన్న కరాబైతే నిన్న రెండో శనివారం సెలవేనాయె. ఇయ్యాళ్ల ఆదివారం వస్తరో రారో తెలుస్తలేదు. పొలం దున్నితే ఎకరానికి రూ.8వేలు ఖర్చయితంది. ఇప్పుడు దున్నిన మడులెండిపొయినయ్. వాటినే మళ్లీ మళ్లీ దున్నాల్సి వస్తున్నది. ఖర్చులన్నీ మీదపడెటట్లున్నయ్. పొలాలెండిపోతున్నా పట్టించుకోకపోతే ఎట్ల? అసలే కరెంటు సరిగ్గ ఇస్తలేరు. వర్షాలేమో వస్తలేవు. ఏం జేసుడో అర్థమైతలేదు.
– ఉచ్చిడి సంతోష్, రైతు, అల్మాస్పూర్, ఎల్లారెడ్డిపేట