హైదరాబాద్, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ): ఏపీలో గంజాయి వ్యవహారం టీడీపీ, వైసీపీ మధ్య అగ్గిరాజేస్తున్నది. నిన్నటివరకు ఆరోపణలు, ప్రత్యారోపణలకు పరిమితమైన వైరం దాడుల వరకు వెళ్లింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వైసీపీ శ్రేణుల దాడులు కొనసాగాయి. ఏపీ సీఎం జగన్ మాదకద్రవ్యాల మాఫియాను ఆంధ్రప్రదేశ్, అఫ్గానిస్తాన్, ఆప్రికా అనే ‘ట్రిపుల్ ఏ’ ఫార్ములాతో విస్తరిస్తున్నారని మంగళవారం టీడీపీ నేత పట్టాభిరాం తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇందుకు నిరసనగా వైసీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆఫీసులపై దాడులకు దిగుతూ వీరంగం సృష్టించాయి. మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంతో పాటు విశాఖ, తిరుపతి, గుంటూరులోని టీడీపీ ఆఫీసులపై దాడిచేశారు. పెద్దసంఖ్యలో మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుకు చేరుకున్న వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా దాడికి తెగబడ్డాయి.
ఈ దాడిలో ఆఫీసు అద్దాలు, ఫర్నిచర్, కార్లు ధ్వంసమయ్యాయి. పలువురు టీడీపీ కార్యకర్తలకు, ఆఫీసులోని పనిచేసేవారికి, అటు వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. విజయవాడలో పట్టాభిరాం ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడిచేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశాయి. రేణిగుంటలో టీడీపీ నేతల ర్యాలీని అడ్డుకున్న వైసీపీ నేతలు వారిపై దాడి జరిపారు. టీడీపీ కార్యాలయాలపై వైసీపీ దాడులను చంద్రబాబునాయుడు ఖండించారు. వెంటనే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఫోన్ చేసి దాడులపై ఫిర్యాదు చేశారు. టీడీపీ కార్యాలయాలకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు. బలగాలను పంపేందుకు హోంశాఖ సానుకూలంగా స్పందించినట్టు టీడీపీ వర్గాలు వెల్లడించాయి.