దేవరుప్పుల, ఫిబ్రవరి 19 : యాసంగి వరి పంటకు సాగునీరందక ఎండిపోతున్న దుస్థితి జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో నెలకొంది. దేవాదుల రిజర్వాయర్ల ద్వారా గతంలో సాగునీరు అందగా రెండు పంటలు పండాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గోదావరి నదిలో నీళ్లున్నా రిజర్వాయర్ల నుంచి కాల్వలకు నీరు విడుదల చేయడం లేదు. ఓ వైపు చెరువుల్లో నీరు లేక, మరోవైపు కాల్వల ద్వారా గోదావరి జలాలు రాక వరి పొలాలు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు సైతం అడుగుంటడంతో బోర్లు ఆగిపోస్తున్నాయి. దీంతో రైతులు ఎండుతున్న పొలంలో పశువులను మేపుతున్నారు. ఇప్పటికైనా కాల్వలు వదిలతే సగం పంటైనా చేతికి వస్తుందని, ఇదే పరిస్థితి కొనసాగితే మార్చి చివరినాటికి వరి చేన్లు పూర్తిగా ఎండిపోయి నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోతున్నారు.
రెండెకరాల్లో యాసంగి నాటుపెట్టిన. బోరు ఆగి పోస్తున్నది. పంట చేతికొచ్చే నమ్మకంలేదు. ఇప్పటికే అరెకరం చేన్ల పాలిచ్చే బర్రెను మేపుతున్న. చెరువుల్లో నీళ్లుంటేనే బోర్లు పోస్తయి. ఈ సారి నీళ్లు నింపలే. నింపుతరనే నమ్మకంతోటి నాటు పెట్టిన. పదేండ్ల నుంచి ఎప్పుడు యాసంగి పంట ఎండలే. ఇదే మొదలు. కాంగ్రెస్ సర్కారు నీళ్లు వదులుతలేదు. నీరులేక గింజ చేతికొచ్చేటట్టు కనబడుతలేదు. ఇంత అధ్వానమైన పరిస్థితి ఎన్నడూ చూడలే.