హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ) : గత యాసంగి సన్నాల బోనస్ పైసలు ప్రభుత్వం ఇప్పటికీ రైతులకు చెల్లించలేదు. అన్నదాతలు ధాన్యం అమ్మి పది నెలలు గడుస్తున్నా పైసలు ఇవ్వక నాన్చుతున్నది. ఇప్పుడు మళ్లీ యాసంగి నాట్లు మొదలయ్యాయి, మరో రెండు నెలలు గడిస్తే పంట కూడా చేతికొస్తది.., అయినా ఆ పంట బోనస్ బకాయి మాత్రం ఖాతాలో పడేది కష్టంగానే అనిపిస్తున్నది. కాగా, ప్రస్తుత వానకాలం సీజన్ బోనస్ పైసల్ని చెల్లించిన సర్కారు అప్పటి యాసంగికి సంబంధించిన చెల్లింపుల ఊసే తీయకపోవడంతో సర్కార్ దగ్గర దుబారాకు పైసలున్నాయిగానీ… కష్టం చేసిన రైతన్నకు బోనస్ చెల్లించేందుకు మాత్రం పైసలు పుట్టడంలేదా అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత యాసంగిలో సర్కార్ రైతుల నుంచి 74.22 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఇందులో 51.03 లక్షల టన్నులు దొడ్డు రకం, 23.19 లక్షల టన్నులు సన్నధాన్యం. ఇందుకు సంబంధించి 4.09 లక్షల మంది రైతులకు రూ. 1159.64 కోట్లు బోనస్ కింద చెల్లించాల్సి ఉన్నా, ఇప్పటికీ నయాపైసా ఇవ్వలేదు. నిజానికి మద్దతు ధర డబ్బులను సివిల్ సప్లయ్ కార్పొరేషన్ బ్యాంకుల వద్ద అప్పులు తెచ్చి రైతులకు చెల్లిస్తుండగా, బోనస్ మాత్రం ఖజానా నుంచి ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో సివిల్ సప్లయ్ అధికారులు సర్కార్కు ఫైల్ పెట్టి చేతులు దులుపుకోగా, అది కాస్త ఆర్థిక శాఖలో మూలుగుతున్నట్టు సమాచారం. 10 నెలలు గడుస్తున్నా ఫైలు మంత్రి ముందుకు రాక, సంతకం కాక, నిధుల విడుదల జరుగకపోవడం గమనార్హం. కాగా, ఖజానా నిండుకోవడం, బోనస్ చెల్లింపులకు నిధులు పుట్టకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత యాసంగి బోనస్ బకాయిల చెల్లింపు విషయమై సర్కార్లో మరో చర్చ జరుగుతున్నట్టు సమాచారం. రైతులు ధాన్యం అమ్మి ఇప్పటికే 8 నెలలకు పైగా గడిచిందని, బకాయి ముచ్చట ఎప్పుడో మర్చిపోయి ఉంటారని చర్చ సాగుతున్న వినికిడి. అదీకాకుండా మొన్నటి వానకాలం బోనస్ ఇచ్చాం.. ఇక యాసంగిది గుర్తుపెట్టుకుంటారా.. చెల్లింపులు అవసరమా.. అని భావిస్తున్నట్టు తెలుస్తున్నది. రైతులు బకాయి కోసం ఆందోళనకు దిగితే అప్పుడు చూడొచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమైనట్ట్టు వినికిడి.