సూర్యాపేట, మార్చి 31 (నమస్తే తెలంగాణ): ‘మీ పాలనలో వరుసగా కాళేశ్వరం నీళ్లు వస్తే పంటలు పండాయి. ఏకంగా పొలం వద్దే ఇల్లు కట్టుకొని సంతోషంగా సాగు చేసుకుంటున్నాం. మా ఖర్మకాలి కాంగ్రెస్ అధికారంలోకి రాగా ఈ సారి ఏసిన ఐదెకరాలు ఎండిపోయినై. వరి ఈనినంక చేతికి వస్తదనుకుంటున్న సమయంలో నీళ్లు రాక ఎండిపోయింది. ఎకరానికి పెట్టుబడిగా రూ.50 వేలు పెట్టినం. రెండు నెలల్లో 12 బోర్లు వేసినా ఫలితం రాలేదు. మా ఒక్క పొలమే కాదు యర్కారం గడ్డ సగం ఊడ్సుకుపోయింది. ఏం లేదు సార్. ముందుగానే నీళ్లు ఇవ్వమంటే పంటలు వేయం కదా. ఇస్తామని చెప్పి కాల్వల్ల కొన్ని నీళ్లు వదిలితే చివరి వరకు నీళ్లు వస్తాయనుకుని పంటలు వేసి అప్పుల పాలయ్యాం’ అని సూర్యాపేట మండలం యర్కారం గ్రామానికి చెందిన మహిళా రైతు సరోజనమ్మ కేసీఆర్కు ఆవేదనతో విన్నవించుకున్నది. ‘లొల్లిబెడితే కాదు. ప్రభుత్వం మెడలు వంచుదాం. కొట్లాడుదాం. మీకు నష్ట పరిహారం వచ్చేదాకా కొట్లాడుదాం. మీరు ధైర్యం కోల్పోకురి. మీకు అండగా ఉంటా. అందరం కలిసి కొట్లాడుదాం. పంట నష్ట పరిహారాన్ని సాధిద్దాం’ అని కేసీఆర్ మహిళా రైతుకు భరోసా కల్పించారు.
పదెకరాలు నాటేస్తే ఎనిమిది ఎకరాలు ఎండిపోయింది
సూర్యాపేట జిల్లాలోకి ప్రవేశించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తుంగతుర్తి మండలంలోని వెలుగుపల్లి వద్ద లకావత్ సురేశ్ అనే రైతును పలుకరించారు. సదరు రైతు వెళ్లబోసుకున్న గోడుకు కేసీఆర్ చలించిపోయారు. ‘నాకు నాలుగు ఎకరాలుంటే పక్కనే మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని మొత్తం పదెకరాలు సాగు చేసిన. ప్రస్తుతం ఎనిమిది ఎకరాలు ఎండిపోయి రెండెకరాలు మాత్రమే మిగిలింది దాదాపు రూ.4 లక్షలకు పైనే ఖర్చు చేస్తే రూ.20 వేల పంట కూడా వచ్చేలా లేదు. మీరున్నన్ని రోజులు వచ్చిన నీళ్లు ఇయ్యాల ఎందుకు వస్తలేవు సార్ ? ఇయ్యాల మీరు రాగానే కాలువల్ల నీళ్లు వదిలిండ్రు. పంటలు ఎండిపోయినంక నీళ్లు వదిలితే ఫాయిదా ఏంముంటది’ అని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. రైతు ఆవేదనకు చలించిన కేసీఆర్ అధైర్య పడొద్దంటూ భరోసా ఇచ్చారు. ‘ఏ రైతు కూడా ఆవేదన చెందొద్దు. మీకు అండగా నేను, బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి ఎండిపోయిన పంటలకు నష్ట పరిహారం తెచ్చుకుందాం.. తెచ్చి తీరుతాం’ అని రైతుకు కేసీఆర్ ధైర్యం చెప్పారు.