యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 28: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు శనివారం నిర్వహించిన శృంగార డోలారోహణంతో ముగిశాయి. శ్రీలక్ష్మీనరసింహస్వామిని 108 కలశాలతో వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడు మ అభిషేకించారు. వేదపండితులు, రుత్వికులు పంచసూక్తాలు, ఆస్థాన విద్వాంసుల మంగళవాయిద్యాల నడుమ గర్భాలయంలోని స్వయంభూమూర్తులు, సువర్ణ ప్రతిష్టామూర్తులకు అష్టోత్తర శత కలశాలతో అభిషేక పూజలు వైభవంగా నిర్వహించారు.
కల్యాణమూర్తులను పట్టుపీతాంబరాలు, ముత్యాలు, రత్నాల ఆభరణాలు, పూలతో దివ్యమనోహరంగా అలంకరించి డోలికలో అధిష్టింపజేశా రు. కార్యక్రమంలో దేవాదాయశాఖ డైరెక్టర్ హనుమంతరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఈవో భవానీశంకర్, డీఈవో భాస్కర్శర్మ తదితరులు పాల్గొన్నారు.