యాదగిరిగుట్ట, మార్చి 2 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజైన ఆదివారం స్వామివారి తిరుకల్యాణ మహోత్సవానికి ముక్కోటి దేవతలందరిని ఆహ్వానించడానికి గరుత్మంతుడిని వియుక్తం చేసే ప్రధాన ఘట్టమైన ధ్వజారోహణ ఘట్టానికి శ్రీకారం చుట్టారు. అంతకుముందు ప్రధానాలయ ఉత్తర మాడవీధుల్లో యాగశాల ప్రవేశం, ధ్వారతోరణ, ధ్వజకుంభారాధన, మహాకుంభారాధన, చతుస్థానార్చన నిర్వహించారు.
తర్వాత అగ్నిప్రతిష్ఠ, మూలమంత్ర, మూర్తిమంత్ర హోమాలు చేశారు. ప్రత్యేకంగా గరుఢ ఆదివాసం, హోమం, పూర్ణాహుతి శాస్ర్తోక్తంగా నిర్వహించారు. సాయంత్రం అష్టదిక్పాలకులను ఆహ్వానించేందుకు భేరీపూజ చేసి, దేవతాహ్వానం పలికారు. బ్రహ్మోత్సవాలు 3వ రోజులో భాగంగా సోమవారం స్వామివారి అలంకార సేవలు ప్రారంభంకానున్నాయి.