యాదగిరిగుట్ట, జూలై 28 : రాబోయే శ్రీవిశ్వావసు నామ సంవత్సరంలో(2025) పండుగల జాబితాను ఖరారు చేశారు. యాదగిరిగుట్టలోని శ్రీహయగ్రీవ గాయత్రి ఆశ్రమం, లక్ష్మీనృసింహ వేదవిద్యాలయంలోని ఐనవోలు అనంతమల్లయ్య సిద్ధాంతి ప్రాంగణంలో తెలంగాణ విధ్వత్సభ అష్టమ వార్షిక విద్వత్సమ్మేళనం-2024 రెండు రోజులపాటు వైభవోపేతంగా సాగింది. పండితులు, ప్రముఖ సిద్ధాంతులు, ప్రధానార్చకులు, పురోహితులు ఆదివారం ముగింపు పలికారు. భద్రకాళి దేవస్థాన ధర్మకర్త శేషుశర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తూండ్ల కమలాకరశర్మ ధర్మశాస్త్ర విషయాలను ప్రవచించారు. జ్యోతిష్య పండితులు, సిద్ధాంతులతో విద్వద్గోష్టి నిర్వహించారు.
పాండురంగ ఆశ్రమ నిర్వాహకులు అప్పాల సత్యనారాయణశర్మ, ఓరుగంటి మనోహరశర్మ సిద్ధాంతి, హయగ్రీవ గాయత్రి ఆశ్రమ వ్యవస్థాపకులు, యాదగిరిగుట్ట దేవస్థాన ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులను సత్కరించారు. కార్యక్రమానికి చంద్రశేఖర్శర్మ అధ్యక్షత వహించగా విద్వత్సభ సలహాదారులు ఆకెళ్ల జయకృష్ణ శర్మ, ఉపాధ్యక్షుడు శ్రీమాన్ తి.న.చ.సం. కృష్ణమాచార్య సిద్ధ్దాంతి, ప్రధాన కార్యదర్శి దివ్యజ్ఞాన సిద్ధాంతి, సంయుక్త కార్యదర్శి గాడిచర్ల నాగేశ్వరశర్మ సిద్ధాంతి, చికిలి లక్ష్మీవెంకటేశ్వరశాస్త్రి సిద్ధాంతి, శృంగేరి ఆస్థాన పండితులు, పౌరాణికులు బాచంపల్లి సంతోష్ కుమారశాస్త్రి, ఈవో భాస్కర్రావు, చైర్మన్ నరసింహమూర్తి పాల్గొన్నారు.
2025 మార్చి 3న ఉగాది, ఏప్రిల్ 6న శ్రీరామనవమి, ఏప్రిల్ 30న అక్షయ తృతీయ, డోలా గౌరీవ్రతం, మే 10న స్మార్త నృసింహజయంతి, శని త్రయోదశి, మే 11న వైష్ణవ నృసింహజయంతి, అగ్ని కర్తరీ ప్రారంభం, మే 22న హనుమజ్జయంతి, జూలై 6న సర్వేషాం ఏకాదశి(తొలి ఏకాదశి), అగస్టు 8న వరలక్ష్మీ వ్రతం, ఆగస్టు 16న కృష్ణాష్టమి, ఆగస్టు 27న వినాయక చతుర్ధి, సెప్టెంబర్ 21న మహాలయ అమావాస్య, అక్టోబర్ 22న దేవీ శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభం, అక్టోబర్ 30న దుర్గాష్టమి(బతుకమ్మ పండుగ), నవంబర్ 1న మహార్నవమి, నవంబర్ 2న విజయదశమి, నవంబర్ 19న నరక చతుర్థశి, నవంబర్ 20న దీపావళి, ధనలక్ష్మి పూజ, 21న కేదార వ్రతం, డిసెంబర్ 16న ధనుర్మాస వ్రతారంభం, 2026లో జనవరి 14న భోగి, మకర, 15న సంక్రాంతి, జనవరి 23న వసంత పంచమి, జనవరి 25న రథ సప్తమి, ఫిబ్రవరి 15న మహా శివరాత్రి, మార్చి 3న హోలి పండుగలను జరుపాలని నిశ్చయించారు.
పుష్కర : 2025 మే 14 వైశాఖ బుధవారం రాత్రి 10.35 గంటలకు సరస్వతి నదీ ప్రవేశం. (పుష్కర స్నానారంభం గురువారం అరుణోదయ వేళ నుంచి)
మూఢ్య నిర్ణయం : 2025 జూన్ 9న, జ్యేష్ఠ శుద్ధ సోమవారం నుంచి జూలై 9న,అషాఢ శుద్ధ బుధవారం వరకు గురు మౌఢ్యం. 2025 డిసెంబర్ 26న, మార్గశిర బుధవారం నుంచి 2026 ఫిబ్రవరి 17 మాఘ మంగళవారం వరకు శుక్ర మౌఢ్యం
గ్రహణములు : 2025 సెప్టెంబర్ 7న, భాద్రపద శుద్ధ ఆదివారం చంద్రగ్రహణం. 2026 మార్చి 3న, ఫాల్గుణ శుద్ధ ముంగళవారం చంద్రగ్రహణం