Telangana | తెలంగాణకే తలమానికమైన యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటున్నది. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తి కాగా, త్వరలోనే ప్రారంభానికి రెండు యూనిట్లను సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి నాలుగు యూనిట్లను రన్ చేయడం ద్వారా దీనిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలన్న లక్ష్యంతో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. నల్లగొండ జిల్లా.. దామరచర్ల మండలం.. వీర్లపాలెం శివారులో అత్యాధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్న యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ జిల్లా అభివృద్ధికి కీలక మలుపు కానున్నది. ఈ ప్లాంట్ ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ ప్లాంట్‌తో మిర్యాలగూడ ప్రాంత రూపురేఖలు మారనున్నాయి.
జిల్లాలో కృష్ణా నది ఒడ్డున దామరచర్ల మండల పరిధిలో ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ మెగా థర్మల్ పవర్ ప్లాంట్ దేశానికే వెలుగుల దివిటిగా మారనున్నది. నాటి సమైక్య పాలనలో తెలంగాణలో అస్తవ్యస్తంగా ఉన్న కరెంటు సమస్యకు పరిష్కారం చూపుతూ 24 గంటల నిరంతర విద్యుత్‌కు సీఎం కేసీఆర్ బాటలు వేశారు. శాశ్వత పరిష్కారం దిశగా థర్మల్ పవర్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఉన్న థర్మల్ ప్లాంట్లన్నీ గోదావరి ఒడ్డునే ఉండగా, తొలిసారి కృష్ణానది తీరంలో దీనిని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి భావించారు. కృష్ణపట్నం పోర్టు, అద్దంకి హైవే కూడా అందుబాటులో ఉండటంతో పవర్ ప్లాంటు ఏర్పాటుకు దామరచర్లను అనువైన ప్రాంతంగా ఎంచుకున్నారు. రూ.30 వేల కోట్ల అంచనా వ్యయంతో నాలుగు వేల మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంటుకు 2015 జూన్ 8న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ప్లాంటు నిర్మించే స్థలం కృష్ణా, మూసీ నదుల తీరానికి సమీపంలో ఉండటంతో నీటి వసతికి ఇబ్బంది కలుగలేదు. సాగుకు అనుకూలంగా లేని భూములు కూడా అందుబాటులో ఉండటంతో ప్రాజెక్టు నిర్మాణానికి 4,650 ఎకరాల భూమిని సేకరించి రైతులకు చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించారు. 2017 అక్టోబర్‌లో ప్లాంటు నిర్మాణ పనులకు కేసీఆర్ శ్రీకారం చుట్టారు.
పవర్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించడం కూడా ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు వల్ల మొత్తం 40 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనున్నది. పవర్ ప్లాంటు నిర్మాణంతో దామరచర్ల, మిర్యాలగూడ ప్రాంతాలు వాణిజ్య కేంద్రాలుగా మారిపోయాయి. ప్రస్తుతం ప్లాంటులో సుమారు పది వేల మందికి పైగా పనిచేస్తున్నారు. ప్లాంటుకు రోజూ 14 రైల్వే బోగీల బొగ్గు అవసరం ఉంటుంది. అందుకు అవసరమైన బొగ్గును సింగరేణి, కృష్ణపట్నం నుంచి దిగుమతి చేసుకునేందుకు సమీపంలోని విష్ణుపురం రైల్వేస్టేషన్ నుంచి రైల్వే ట్రాక్‌లను అనుసంధానిస్తున్నారు. యాదాద్రి ప్లాంట్ నుంచి ఇతర ప్రాంతాలకు విద్యుత్తును గ్రిడ్లకు సరఫరా చేసేందుకు అవసరమైన టవర్ల నిర్మాణం పూర్తి చేశారు. భవిష్యత్తులో ఇక్కడే సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణం కూడా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. ప్లాంటు ఏర్పాటుతో దామరచర్ల, మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ప్లాంటు పూర్తయితే అనుబంధంగా మరిన్ని పరిశ్రమలు ఈ ప్రాంతానికి తరలివచ్చే అవకాశాలు ఉన్నాయి.
దేశంలోనే అతి పెద్దదైన సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంటు పనులు శరవేగంగా ప్రారంభమైనా కొందరు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వాటిని ఛేదించుకుని పనులు కొనసాగిస్తూ వస్తున్నది. ప్లాంటు పనులను సైతం ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్‌ఈఎల్‌కే అప్పగించారు. ఒక్కో యూనిట్‌ను 800 మెగావాట్ల సామర్థ్యంతో మొత్తం ఐదు యూనిట్లను నిర్మిస్తున్నారు. ఇందులో రెండు యూనిట్లతో ఈ ఏడాది చివరి నాటికి ఉత్పత్తి ప్రారంభించేలా టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నారు. గతేడాది నవంబర్ 28న మంత్రి జగదీశ్‌రెడ్డి, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావుతో కలిసి కేసీఆర్ ప్లాంట్ పనులను పరిశీలించారు. సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికే ప్లాంటుకు కావాల్సిన బాయిలర్లు, చిమ్నీలు, సబ్స్టేషన్లు, రిజర్వాయర్ల నిర్మాణం పూర్తయ్యాయి. మెగా మోటర్లను బిగించారు. ప్లాంటుకు కావాల్సిన నీటి సదుపాయాన్ని సమీపంలోని కృష్ణానది నుంచి పైప్‌లైన్ ద్వారా సేకరిస్తున్నారు.
పవర్ ప్లాంట్ నిర్మాణం పూర్తయితే సుమారు 10 వేల మంది వరకు పనిచేస్తారని అంచనా. వీరందరి కోసం టౌన్షిప్ నిర్మించాలని సీఎం ఆదేశించారు. సుమారు 100 ఎకరాల్లో క్వార్టర్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. గెస్ట్‌హౌస్, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌తో పాటు ప్లాంట్ ఆవరణలోనే సూపర్ మార్కెట్, కమర్షియల్ కాంప్లెక్స్, క్లబ్ హౌస్, హాస్పిటల్, స్కూల్, ఆడిటోరియం, మల్టీప్లెక్స్‌ల నిర్మాణం కోసం చర్యలు చేపట్టారు. పవర్ ప్లాంట్ సిబ్బందికి సేవలందించే ప్రైవేట్ సర్వీస్ స్టాఫ్‌కు సైతం ఇక్కడే వసతి ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. మొత్తంగా వేలాది మందికి ఉపాధి కల్పించేలా ప్లాంట్ నిర్మాణం జరుగుతుండటంతో ఈ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
…?మర్రి మహేందర్‌రెడ్డి