యాదాద్రి, డిసెంబర్ 17: యాదాద్రీశుడి ఆలయ ముఖమండపం స్వర్ణకాంతిమయం కానున్నది. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా స్వామివారి గర్భాలయానికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభానికి బంగారు తొడుగుల పనులను శుక్రవారం వైటీడీఏ అధికారులు ప్రారంభించారు. అద్భుతంగా తీర్చిదిద్దిన బంగారు తొడుగులను ధ్వజస్తంభం పీఠానికి బిగించారు. 1,785 గ్రాముల మేలిమి బంగారంతో చెన్నైకి చెందిన స్మార్ట్ క్రియేషన్ సంస్థ ప్రత్యేక బంగారు తాపడాలను, రాగి పనులను మహాబలిపురానికి చెందిన శిల్పి రవీంద్రన్ చేశారు. బంగారు తాపడంపై పుష్పాలు, సింహం ఆకృతులు, ఉపపీఠాల వంటి రూపాలను ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి చెక్కారు. ఈ నెలాఖరులోగా పనులు పూర్తికానున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే స్వామివారి గర్భగడి ముఖద్వారం తలుపులకు బంగారు తొడుగుల పని పూర్తి చేశారు. ధ్వజస్తంభానికి ముందు భాగంలో ఉన్న బలిపీఠానికి బంగారు తొడుగుల బిగింపు పనులను త్వరలో చేపట్టనున్నారు. ఇందుకోసం 1,552 గ్రాముల బంగారాన్ని వినియోగించనున్నట్టు అధికారులు వెల్లడించారు.