యాదాద్రి, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి అనుబంధాలయమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామి మహాకుంభాభిషేక మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వయంభూ పంచనారసింహుడి అనుమతితో బుధవారం ఉదయం 9 గంటలకు ఆలయ అర్చక బృందం, ఆచార్య బ్రహ్మవేదపారాయణ, యజ్ఞాచార్య, రుత్విక్, పరిచారిక బృందం విఘ్నేశ్వరుడి పూజతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టాయి. శ్రీరాంపురం (తొగుట) పీఠాధీశ్వరులు మాధవానంద సరస్వతీస్వామి ఆధ్వర్యంలో శివాలయం మాఢవీధుల్లో నిర్మించిన యాగశాల ప్రాంగణంలో విఘ్నాధిపతి అనుగ్రహాన్ని పొందారు. స్వస్తివాచనం, పుణ్యాహవాచనం, నాందిముఖం, దేవతారాధన, దేవతాహ్వానం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, అంకురారోపణ నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో అనువంశిక ధర్మకర్త బీ నరసింహమూర్తి, ఆలయ ఈవో ఎన్ గీత, ఆలయ ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, శివాలయ ప్రధాన పురోహితులు సత్యనారాయణ శర్మ, ప్రధానార్చకులు నర్సింహరాములు శర్మ, భద్రకాళీ ఆలయ ప్రధానార్చకులు శేషశర్మ పాల్గొన్నారు. మహాకుంభాభిషేకంలో భాగంగా గురువారం ఉదయం యాగశాల ప్రవేశం చేపట్టనున్నారు.