Congress | యాదాద్రి భువనగిరి యాదగిరిగుట్ట, జనవరి 8 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ గోపినాయక్పై వేటు పడింది. అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడ్డట్టు నిగ్గు తేలడంతో అతడిని సస్పెండ్ చేస్తున్నట్టు జిల్లా సబ్ రిజిస్ట్రార్ హరికోట్ల రవి వెల్లడించారు. బుధవారం నమస్తే తెలంగాణ పత్రిక ‘అగరువనం ఆరగింత’ పేరుతో కథ నం ప్రచురించింది. కాంగ్రెస్ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో యాదగిరిగుట్టలో జరుగుతున్న భూదందాను వెలుగులోకి తీసుకొచ్చింది. కథనంపై స్పందించిన రాష్ట్ర స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కమిషనర్ బుద్ధప్రకాశ్ విచారణకు ఆదేశించారు. రంగంలోకి దిగిన జిల్లా సబ్ రిజిస్ట్రార్ హరికోట్ల రవి ఇతర అధికారులతో కలిసి యాదగిరిగుట్ట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి, రిజిస్ట్రేషన్ల పత్రాలు పరిశీలించారు. 154 ప్లాట్లు అక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగినట్టు గుర్తించారు. దీంతో బాధ్యుడైన యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ గోపి నాయక్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
అంతా నా ఇష్టం!
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల దందా వెలుగులోకి వచ్చింది. సర్వే నంబర్ 472, 473లో మొత్తం 7.27 ఎకరాల భూమిని స్థానికంగా కాంగ్రెస్ కీలక నాయకుడు తన అనుచరుల పేరుతో గత డిసెంబర్ 17న సేల్ డీడ్ చేశారు. ఆలేరు తహసీల్దార్ కూడా నాలా కన్వర్షన్‌కు సహకరించారు. ఆ ప్రజాప్రతినిధి అండతో గుంట నాలా కన్వర్షన్ చేసి, మిగతా ప్లాట్ల కన్వర్షన్ లేకుండానే రిజిస్ట్రేషన్ చేశారు. యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 154 మంది పేరుతో ఒక్కొక్కరికి గుంట, రెండు గుంటలు ఓపెన్ ప్లాట్లుగా రిజిస్ట్రేషన్ చేశాడు. ఈ అక్రమ దందా అంతా డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 23 వరకు 4 రోజుల్లోనే చకచకా కానిచ్చారు. ప్రజాప్రతినిధితో పోలీసులు, రిజిస్ట్రేషన్ అధికారులు కుమ్మక్కు కావడంతో అక్రమదందా యథేచ్ఛగా సాగిందని తెలుస్తున్నది.
తేలుకుట్టిన దొంగలా కాంగ్రెస్ నేత!
నమస్తే తెలంగాణ కథనంతో కాంగ్రెస్ నాయకుడి భూదందా బహిర్గతమైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా మొత్తం ఆగరు వనం ఆరగింత కథనంపై చర్చ జరుగుతున్నది. దీంతో ఉలిక్కిపడ్డ అధికారపార్టీ నేత తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ వ్యవహారాన్ని చక్కదిద్దాలని అనుచరులను రంగంలోకి దింపాడు. భూబాధితులతో బేరసారాలకు దిగినట్టు తెలుస్తున్నది. మరోవైపు కాంగ్రెస్ నాయకుడి ఆదేశాలతో ఆయన అనుచరులు బుధవారం యాదగిరిగుట్టలో పత్రికా సమావేశం నిర్వహించారు. అక్రమాలను ఖండించేందుకు తంటాలు పడ్డారు.
నీళ్లు నమిలిన భూయజమానులు
‘అగరు వనం ఆరగింత’ కథనంతో వెంచర్ యజమాని జంగయ్య, తన వ్యాపార భాగస్వాములతో కలిసి యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. నమస్తే తెలంగాణ కథనంలో వాస్తవం లేదని, తాము ఓ ప్రజాప్రతినిధిని కలిశామంటూ వస్తున్న ప్రచారం అబద్ధమని చెప్పుకొచ్చారు. ఏ ప్రజాప్రతినిధి అని విలేఖరులు ప్రశ్నించగా నీళ్లు నమిలారు. తాము ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కలిసినట్టుగా జరుగుతున్న ప్రచారంలోనూ నిజం లేదని చెప్పారు.