హైదరాబాద్ : మోదీ పాలనలో విదేశీ పెట్టుబడులు(Foreign investment) తగ్గిపోతున్నాయని, భారతదేశంపై నమ్మకం కోల్పోయి అంతర్జాతీయ కంపెనీలు దేశాన్ని విడిచి వెళ్లిపోతున్నాయని , రెడ్కో మాజీ చైర్మన్, బి.ఆర్.ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనితీరు చారానా పనికి నూరు రూపాయల ప్రచారం లాగే ఉందని ఎద్దేవా చేశారు. పబ్లిసిటీ ఎక్కువ పని తక్కువ అనేది ప్రత్యక్షంగా కనిపిస్తుందన్నారు. విశ్వ గురువుగా చెప్పుకునే మోదీ పాలనలో దేశ ఆర్థిక పరిస్థితి నానాటికి పాతాళానికి దిగజారుతోందన్నారు.
నోరు తెరిస్తే ట్రిలియన్ డాలర్ల ఎకానమీ.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంటూ ఉపన్యాసాలు ఇచ్చే నరేంద్ర మోదీ పనితీరు మాత్రం పూర్తిగా జీరో అయిందని విమర్శించారు. ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పూర్తిగా తగ్గిపోయాయి. నానాటికి అవి దిగజారుతూనే ఉన్నాయి. 2015లో 31 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఉంటే అవి 2023 నాటికి 28.1 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇక 2024 కు 27.6 బిలియన్ డాలర్లకు దిగజారిపోయాయి.
ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఈజిప్ట్, బ్రెజిల్, మెక్సికో లాంటి దేశాల కంటే దారుణంగా భారత్ పరిస్థితి మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో టాప్ టెన్ జాబితాలో కూడా చోటు సంపాదించలేకపోయిందని పేర్కొన్నారు. అంటే విశ్వగురు పనితీరు ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చన్నారు. దేశంలో కంటే విదేశాల్లోనే ఎక్కువగా ఉండే ప్రధానమంత్రి.. తాను దేశానికి వేలకోట్ల పెట్టుబడి తీసుకొస్తున్నానని, ప్రపంచ దేశాలని తన గుప్పిట్లో పెట్టుకున్నానని స్పీచ్ లు ఇస్తారు. నరేంద్ర మోవా విదేశాలకు వెళ్ళిన ప్రతిసారి పెట్టుబడుల వరద అంటూ బిజెపి నాయకులు, కార్యకర్తలు దేశవ్యాప్తంగా, ఇటు సోషల్ మీడియాలోనూ బీభత్సమైన హడావిడి చేస్తారు. పత్రికల్లో పెద్దపెద్ద ప్రకటనలు ఇచ్చుకుంటారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం ఇంత దారుణంగా ఉందన్నారు.
డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ దేశంలో ఊదరగొడుతున్న బిజెపి నానాటికి దిగజారుతున్న దేశ ఆర్థిక పరిస్థితి పై మాత్రం మాట్లాడటం లేదు. కేవలం నరేంద్ర మోదీ పబ్లిసిటీ తప్ప పని మాత్రం ఎక్కడా ఏమీ కనిపించడం లేదు. అందుకే భారతదేశంపై విదేశాలకు, విదేశీ కంపెనీలకు నమ్మకం తగ్గుతోందని స్పష్టం చేశారు. వారి పెట్టుబడులు కూడా నానాటికి తగ్గిపోతున్నాయి. దేశంలో ఇప్పటికే ఉన్న విదేశీ కంపెనీలు కూడా ముల్లే మూటా సర్దుకుని ఇతర దేశాలకు వెళ్లిపోతున్నాయి. ఇది విశ్వగురువు పనితనానికి నిదర్శనం అని విమర్శించారు.