హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం సర్కార్‌పై ఉమ్మడి పోరు చేద్దామని రెడో మాజీ చైర్మన్ వై సతీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇందుకు కళాశాలల యాజమాన్యాలు కలిసి రావాలని శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. రాష్ట్రంలో దాదాపు రూ.10 వేల కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని, 13 లక్షల మంది విద్యార్థుల చదువు పూర్తయినా రీయింబర్స్ మెంట్ బిల్లులు రాక, సర్టిఫికెట్లు అందక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం డిగ్రీ, పీజీ, ఫార్మసీ, ఇంజినీరింగ్ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లులను ప్రభుత్వం చెల్లించనేలేదని, ఒకో కాలేజీలో 200 నుంచి 500 మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రావాల్సి ఉన్నదని గుర్తుచేశారు.
ఫీజు బకాయిల కారణంగా విద్యార్థులకు కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వక ఐఐటీ ఖరగ్ పూర్, ఎన్ఐటీ లాంటి ప్రఖ్యాత విద్యాసంస్థల్లో సీట్లు వచ్చినా విద్యార్థులు చేరలేని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తంచేశారు. 20 నెలల్లో రెండున్నర లక్షల కోట్ల అప్పుచేసిన సరారు.. కేవలం రూ.10 వేల కోట్ల ఫీజు బకాయిలను ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు.
వందలాది కోట్లు పెట్టి హైదరాబాద్‌లో ఆర్టిఫీషియల్ బీచ్‌లు కట్టడానికి, అందాల పోటీలు నిర్వహించడానికి ప్రభుత్వం వద్ద డబ్బులుంటాయి కానీ, పిల్లల చదువుల కోసం సర్కారు వద్ద డబ్బుల్లేవా? అని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలకు డబ్బుల్లేవంటూనే లక్షన్నర కోట్లతో మూసీ ప్రక్షాళన చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి పొంకనాలు కొడుతున్నారని ఎద్దేవాచేశారు. ఏదైనా ప్రైవేటు ఉద్యోగం చేద్దామన్నా సర్టిఫికెట్లు చేతికి రాకుండా అడ్డుకుంటున్నదని మండిపడ్డారు.