హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సామాజిక, చారిత్రక సాహితీవేత్త, ప్రముఖ రచయిత కొంపెల్లి వెంకట్‌గౌడ్ (52) గురువారం ఉదయం గుండెపోటుతో విద్యానగర్ దుర్గాబాయి దేశ్‌ముఖ్ దవాఖానలో మృతి చెందారు. ఆయన మృతి తెలంగాణ సమాజానికి, సాహితీలోకానికి తీరని లోటు అని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తంచేశారు. సూర్యాపేట జిల్లా కలకోవకు చెందిన కొంపెల్లి వెంకట్‌గౌడ్ నల్లగొండలో డిగ్రీ పూర్తి చేశారు. కాకతీయ యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లిష్ చదివారు. హైదరాబాద్‌లోని నల్లకుంటలో స్థిరపడ్డారు.
తెలంగాణవాదిగా, బహుజన వర్గాల అభ్యున్నతిని కాంక్షిస్తూ వెంకట్‌గౌడ్ పలు రచనలు చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ సంభాషణను ‘వొడువని ముచ్చట’గా, నీటిపారుదలరంగ నిపుణుడు, మాజీ ప్రభుత్వ సలహాదారు ఆర్ విద్యాసాగర్‌రావు జీవిత చరిత్రను ‘నీళ్ల ముచ్చట’ పేరిట పుస్తకాలుగా తీసుకొచ్చారు. కమ్యూనిస్టు యోధుడు ధర్మభిక్షం, నల్లగొండకు చెందిన ప్రముఖ రచయిత నోముల సత్యనారాయణ జీవిత చరిత్రలను కూడా గ్రంథస్థం చేశారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చరిత్రను రికార్డుచేసి వెలుగులోకి తీసుకొచ్చారు. వెంకట్‌గౌడ్ చివరి కోరిక మేరకు ఆయన పార్ధివ దేహాన్ని వైద్య పరిశోధనల కోసం గాంధీ మెడికల్ కాలేజీకి, కండ్లను ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యశాలకు కుటుంబసభ్యులు దానం చేశారు.
కొంపెల్లి వెంకట్‌గౌడ్ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు గురువారం సంతాపం ప్రకటించారు. ప్రొఫెసర్ జయశంకర్‌తో సంభాషణ ‘వొడువని ముచ్చట’ పుస్తకం ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనుసరించాల్సిన రాజకీయ భావజాలాన్ని వ్యాప్తిచేసిన ఉద్యమ రచయిత కొంపెల్లి అని పేర్కొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను రికార్డు చేసి, వెలుగులోకి తెచ్చి, బీసీల రాజకీయ చైతన్యం కోసం పాటుపడిన ఘనత కొంపెల్లిదేనని తెలిపారు.
వారితో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. తెలంగాణవాదిగా, బహుజనవర్గాల అభ్యున్నతిని కాంక్షిస్తూ, పలు రచనలు చేసిన వెంకట్‌గౌడ్ అకాల మరణం తెలంగాణ సాహితీలోకానికి తీరనిలోటని విచారం వ్యక్తంచేశారు. వారి మరణంతో శోకతప్తులైన కుటుంబ సభ్యులు, మిత్రులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
కొంపెల్లి వెంకట్‌గౌడ్ మరణం తెలంగాణ సాహిత్యరంగానికి తీరనిలోటు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం తెలియజేశారు. తెలంగాణ మట్టిబిడ్డ కొంపెల్లి ఇక లేరన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. తెలంగాణ తత్వం, ఉద్యమ భా వజాలాన్ని తన కలంలో నింపుకున్న గొప్ప రచయిత కొంపెల్లి వెంకట్‌గౌడ్ మరణం తెలంగాణ సాహిత్యరంగానికి తీరని లోటు అని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర వెంకట్ మృతి పట్ల సంతాపం వ్యక్తంచేశారు. వెంకట్‌గౌడ్ సంతాపసభను గురువారం చిక్కడపల్లిలో నిర్వహించారు. మాజీ మంత్రి వీ శ్రీనివాసగౌడ్తోపాలు పలువురు సంతాపసభలో పాల్గొని నివాళులు అర్పించారు. సంతాపసభలో కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.