Ramoji Film City | హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 8(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ అంటే గుర్తొచ్చేవి చారిత్రక కట్టడాలు, జంట జలాశయాలు, ఆకాశహర్మ్యాలే కాదు, లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్ సిటీ ఇన్ ది వరల్డ్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్న రామోజీ ఫిలింసిటీ కూడా! షార్ట్ ఫిలిం నుంచి హాలీవుడ్ సినిమాల దాకా చిత్రీకరించేందుకు అవసరమైన 24 క్రాఫ్ట్స్ కలిగిన ఏకైక కళాత్మక సినీ సామ్రాజ్యాన్ని మీడియా అధినేత రామోజీరావు 1996లో స్థాపించారు. 1983లోనే ఉషా కిరణ్ మూవీస్ ప్రొడక్షన్ హౌస్ నిర్మించిన ఆయన, సినిమా రంగానికి కావాల్సిన సౌకర్యాలు అందించేందుకు స్టూడియో నిర్మించారు. 1997లో తొలిసారిగా ‘నాన్నకు మళ్లీ పెళ్లి’ సినిమా ఫిలింసిటీలో తీశారు. దాదాపు రెండువేల ఎకరాల్లో రూపుదిద్దుకున్న ఈ అత్యద్భుత ఫిలింసిటీని తొలుత సినిమాల నిర్మాణానికే వినియోగించినా కాలక్రమంలో పర్యాటక ప్రాంతంగా అవతరించింది.
నగరశివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో హాలీవుడ్ తరహా స్టూడియో కట్టాలని భావించిన రామోజీ, భూమిని సేకరించి ఇంటిగ్రేటెడ్ సినీ స్టూడియో నిర్మించారు. ఉషాకిరణ్ ప్రొడక్షన్ హౌస్‌తోపాటు, విశాలమైన కట్టడంగా తీర్చిదిద్దారు. సహజసిద్ధమైన కొండలు, గుట్టలను అల్లుకొని గార్డెన్లు, సినీ సెట్టింగులు, ప్రపంచ చార్రితక కట్టడాల నమూనాలు, హోటళ్లు ఏర్పాటు చేశారు. ఫిలింసిటీలో 28ఏండ్లలో 2500కు పైగా సినిమాలు చిత్రీకరించారు.ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ దాకా సినీ రంగానికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఉన్న ఫిలిం సిటీ, ‘హబ్ ఆఫ్ మీడియా హౌసెస్’గా రూపాంతరం చెందింది. ఒక్కో సినిమా యూనిట్లో 200-250 మంది సినీ కార్మికులు ఉంటే.. ఏక కాలంలో 20కి పైగా సినిమాలను తెరకెక్కించేంత స్థాయిలో మౌలిక వసతులు కలిగి ఉంది.
పూర్తిస్థాయి సినీ అవసరాలను తీర్చే వేదికైన ఫిలింసిటీ, ఆనతి కాలంలోనే అంతర్జాతీయ స్థాయిలో పొందిన ఆదరణతో పర్యాటకప్రాంతంగా మారింది. అమ్యూజ్మెంట్ పార్కులు, గార్డెన్లు, ఢిల్లీలో ఉండే తాజ్‌మహల్ నమూనా, జపనీస్ గార్డెన్స్‌తో పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచింది. ఆఫర్డబుల్ హోటల్ నుంచి వరల్డ్‌క్లాస్ సూట్ కలిగిన ఏకైక సినీ సామ్రాజ్యంగా రామోజీ ఫిలింసిటీ అవతరించింది.