హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : ఆదివాసీ, గిరిజనుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని గిరిజన భవన్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మంత్రి సీతక్కతో కలిసి అడ్లూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు ఆదివాసీ, గిరిజన, లంబాడీ, కోయ, గోండు, చెంచు, కోలం తదితర జాతుల ఆధ్వర్యంలో గిరిజన సంప్రదాయ వృత్తులు, కళారూపాలను ప్రదర్శించారు. మం త్రులు ఆదివాసీలతో కలిసి నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా అడ్లూరి మాట్లాడుతూ.. ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూముల జోలికి వెళ్లవద్దని అధికారులను ఆదేశించినట్టు గుర్తుచేశారు.
భూములపై పూర్తిహక్కులు ఉండేలా పట్టాలు అందజేస్తున్నట్టు చెప్పారు. ఎస్టీఎస్డీఎఫ్ కింద రూ.17,168 కోట్లు, గిరిజన సంక్షేమశాఖకు రూ.6,860 కోట్లు కేటాయించామని, 22,016 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని వెల్లడించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఆదీవాసీలు, గిరిజనులమని గర్వంగా చెప్పుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ బెల్లయ్యనాయక్, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినెని వీరయ్య, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి అండ్ కమిషనర్ అలగు వర్షిణి, గిరిజన సంక్షేమశాఖ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్‌రెడ్డి, ట్రైకార్ జీఎం శంకర్రావు, టీజీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి సీతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
గిరిజన సంస్కృతిని కాపాడుకుందాం: అంజయ్య
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా పోరాడి గిరిజన సంస్కృతిని కాపాడుకుందామని అఖిల భారత ఆదివాసీ మహాసభ జాతీయ కార్యదర్శి రమావత్ అంజయ్యనాయక్ పిలుపునిచ్చారు. ఆదివాసీల హక్కుల దినోత్సవం సందర్భంగా గిరిజన భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ సర్కారు అటవీ సంపదను అదానీ, అంబానీలకు కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధంకావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రూప్‌సింగ్‌నాయక్, శంకర్‌నాయక్, హరిసింగ్‌నాయక్, నారాయణనాయక్, దస్రూనాయక్, రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు.