హైదరాబాద్, నవంబర్16 (నమస్తే తెలంగాణ): ఇండోనేషియాలోని బాలిలో ప్రపంచ చేనేత దినోత్సవ సన్నాహక సదస్సును వచ్చే ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్టు అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మిషన్ వరల్డ్ హ్యాండ్లూమ్ డే సాధనలో భాగంగా ఈ సదస్సును నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.
సదస్సు అనంతరం అక్కడి టెంగనాన్, సుకరార, సాడే, ప్రైలు, వాటుబ్లపి తదితర చేనేత గ్రామాల పర్యటన ఉంటుందని తెలిపారు. ఇండోనేషియా సుప్రసిద్ధ చేనేత కళాకారులతో ఇష్టాగోష్ఠి, ఇకత్ కళ పుట్టు పూర్వోత్తరాలపై ప్రజెంటేషన్ ఉంటాయని పేర్కొన్నారు. ఇండోనేషియాలో నివసించే చేనేత బంధుమిత్రుల సమాచారం, వివరాలను 73825 57788 నంబర్‌కు వాట్సప్ చేయాలని కోరారు.