మంచిర్యాల, జూన్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ గోదావరిఖని/ భూపాలపల్లి రూరల్ : సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంపై కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు కన్నెర్రజేశారు. సింగరేణివ్యాప్తంగా గనులపై శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించి, ధర్నాలు చేసి కేంద్రం దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. సింగరేణి జోలికొస్తే ఊరుకునేది లేదని, కేంద్రం దిగిరాకపోతే ఆందోళనలు మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ పౌరుడైన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఇక్కడి సింగరేణి బొగ్గు బ్లాకులను వేలం వేయడం దారుణమని, ఇప్పటికైనా టెండర్‌ను విరమించి తెలంగాణకు గుండెకాయలాంటి సింగరేణిని కాపాడాలని కోరారు. కేంద్ర మం త్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన పది రోజుల్లోనే సింగరేణి గనులను వేలం వేస్తున్నారని విమర్శించారు.
బడా పారిశ్రామిక వేత్తలకు తొ త్తులుగా మారి నాలుగు నల్ల చట్టాలు చేశారని మండిపడ్డారు. గనులను వేలం వేయకుండా సింగరేణికే అప్పగించాలని డిమాండ్ చేశారు. శ్రీరాంపూర్ జీఎం సంజీవరెడ్డికి ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కె సమ్మయ్య, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు కొట్టె కిషన్‌రావు, సహాయ కార్యదర్శి కొంరయ్య వినతి పత్రం ఇచ్చారు. శ్రీరాంపూర్ ఆర్కే 7గనిపై ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు శంకర్రావు, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి గరిగె స్వామి, టీబీజీకేఎస్ నాయకుడు రాజూనాయక్, శ్రీనివాస్, సీఐటీయూ పిట్ కార్యదర్శి పెరుక సదానందం, డివిజన్ ఆర్గనైజర్ కస్తూరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో, మందమర్రి ఏరియాలో ఏఐటీయూ సీ బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయ ణ, ఏరియా ఉపాధ్యక్షుడు భీమనాథుని సుదర్శన్ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మందమర్రి ఏరియాలోని కేకే-5గని వద్ద ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేశారు.
హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, ఐఎఫ్టీయూ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్, ఉద్యోగుల సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు గట్టయ్య ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కార్మిక నాయకులను గని మేనేజర్ అల్లావుద్దీన్ అడ్డుకున్నా వారు గని ముఖద్వారం వద్ద నిరసన కొనసాగించారు. ప్రైవేటీకరణ నిర్ణయానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న మేనేజర్‌పై సీఎండీ బలరాం చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మందమర్రి ఏరియా కాసిపేట గనిపై ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేశ్ ఆధ్వర్యంలో, గోదావరిఖని ఓసీపీ-5లో ఏఐటీయూసీ ఉప ప్రధానకార్యదర్శి మడ్డి ఎల్లారెడ్డిగౌడ్ ఆధ్వర్యంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియ న్ నేతలు, భూపాలపల్లి ఏరియాలోని బొగ్గు గనులు, డిపార్ట్మెంట్ల వద్ద ఏఐటీయూసీ భూపాలపల్లి జిల్లా సహాయ కార్యదర్శి విజేందర్, కేటీకే ఓసీ-3 పిట్ సెక్రటరీ శంకర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. కోల్ బ్లాక్‌ల వేలంలో రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి పాల్గొనవద్దని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈమేరకు హెచ్ఎంఎస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో పలు తీర్మానాలు చేసింది.