జయశంకర్ భూపాలపల్లి, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : భూపాలపల్లి ఏరియాలోని కేటీకే-5 ఇైంక్లెన్లో సోమవారం జరిగిన ప్రమాదంలో కార్మికుడికి తీవ్రగాయాలయ్యాయి. ఫ్రీ షిప్టులో విధులకు హాజరైన కార్మికులు గనిలో పూర్ణితో బొగ్గు పొరలను పేల్చే పనిలో షార్ట్ ఫైరర్ కార్మికులు నిమగ్నమయ్యారు. ఎస్ఎస్2, 32 లెవల్లో షార్ట్ఫైరర్ శ్రీరాముల ప్రదీప్తోపాటు మరి కొంతమంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రదీప్ పూర్ణిని అరచేతిలో పట్టుకొని స్కాన్ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు పేలడంతో అతడి చేతి వేళ్లు తెగిపడ్డాయి. పక్కనే కార్మికులు లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. ప్రమాదానికి గురైన కార్మికుడిని కేవలం ఒక కార్మికుడు మాత్రమే మ్యాన్రైడింగ్పై తీసుకురావడంతో కార్మికులు అధికారుల తీరుపై ఆందోళనకు దిగారు. కమీషన్ల కోసం నాణ్యతలేని పరికరాలు కొనుగోలు చేస్తూ కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అనంతరం కార్మికుడిని హైదరాబాద్ దవాఖానకు తరలించారు.