ఖైరతాబాద్, ఆగస్టు 4: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కామర్స్ డిగ్రీ, పీజీ కళాశాల తెలుగు శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ సంకలనం చేసిన ‘నార్ల మాట’- జాతి భవిష్యత్తుకు బాట పుస్తకాన్ని కళాశాల ఆడిటోరియంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులు సాగి కమలాకర శర్మ ఆవిషరించారు. అనంతరం తొలి ప్రతిని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య పిల్లలమర్రి రాములు అందించారు.
ఈ సందర్భంగా కమలాకర్ శర్మ మాట్లాడుతూ నార్ల సంపాదకీయాలు, సమీక్షలు తెలుగు వచనానికి ఆదర్శమన్నారు.నవతెలంగాణ ఎడిటోరియల్ సభ్యులు అనంతోజు మోహనకృష్ణ పుస్తకాన్ని సమీక్షిస్తూ, ఇందులోని 35 సంపాదకీయాలు, సమీక్షలు జర్నలిజం, తెలుగు సాహిత్య విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఎంతో ఉపయోగకరమని పేరొన్నారు.
సంకలనకర్త వేణుగోపాల్ మాట్లాడుతూ నార్ల రచనల్లోని విలువలను నేటి తరానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ సంకలనాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. తెలుగు వచనానికి వెలుగుతోవ సిరీస్లో భాగంగా మరో ఏడు పుస్తకాలను కూడా ప్రచురించనున్నట్లు వెల్లడించారు. కళాశాల చైర్మన్ ఆచార్య వంగపల్లి విశ్వనాథం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యక్షులు ఇ. రామకృష్ణ , ఐఐఎంసీ కళాశాల ప్రిన్సిపాల్ కూర రఘువీర్, మాజీ ప్రిన్సిపాల్ పి. పూర్ణచంద్రరావు, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, సాహితీవేత్తలు పాల్గొన్నారు.