న్యూఢిల్లీ, ఆగస్టు 4: ఇన్నాళ్లూ డిజిటల్ పేమెంట్స్‌ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ వచ్చిన మోదీ సర్కార్.. ఇక ఈ జోరుకు బ్రేకులు వేసే దిశగా వెళ్లనున్నది. అవును.. మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం 2007కు సవరణలను ప్రతిపాదించింది. దీనివల్ల యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా జరిగే లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్లు (ఎండీఆర్) మళ్లీ రాబోతున్నాయి. అయితే యూపీఐ సేవల విస్తరణ తదుపరి వృద్ధికి నిధుల కోసమే ఈ సవరణలు అని తెలుస్తుండగా.. సదరు చట్ట సవరణతో యూపీఐ చెల్లింపులపై చార్జీలుపడే వీలుందన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయిప్పుడు.
ఇదీ సంగతి..
పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007కు సవరణలు చేస్తే యూపీఐపై ఎండీఆర్‌ను విధించడానికి కేంద్ర ప్రభుత్వానికి అవకాశం లభిస్తుంది. అలాగే ప్రస్తుతం సెక్షన్ 10ఏ కింద జీరో ఎండీఆర్ నిబంధనను రద్దు చేయవచ్చు. నిజానికి ఈ నిబంధన వల్లే ఆన్లైన్ పేమెంట్స్‌పై బ్యాంకులు, పేమెంట్స్ సిస్టమ్ ప్రొవైడర్స్ (పీఎస్పీలు)చార్జీలు వసూలు చేయడం లేదు. చట్ట సవరణతో చార్జీలు అమల్లోకి వస్తాయి. రూ.2వేలకు మించిన లావాదేవీలపై 0.3 శాతం నుంచి 0.5 శాతం వరకు ఎండీఆర్‌ను విధించే యోచనలో ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే వార్షిక టర్నోవర్ రూ.1.5 కోట్లు దాటిన వ్యాపారులపైనే ఈ భారం ఉండవచ్చని తెలుస్తున్నది. దీనివల్ల అంతిమంగా కొనుగోలుదారులపైనే భారం పడుతుందన్న ఆందోళనలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి.
ఉదాహరణకు..
ఓ కస్టమర్ రూ.1,000 విలువైన వస్తువును ఓ షాపులో కొన్నారు. క్రెడిట్, డెబిట్ కార్డు లేదా యూపీఐ యాప్ ద్వారా చెల్లించారు. జీరో ఎండీఆర్ పాలసీ వల్ల ఇప్పుడు ఈ పేమెంట్‌ను కస్టమర్‌కు చెందిన బ్యాంక్, వ్యాపారికి చెందిన బ్యాంక్‌లతోపాటు పీఎస్పీలు ఉచితంగానే ప్రాసెస్ చేస్తున్నాయి. దీనివల్ల సదరు వస్తువును అమ్మిన వ్యాపారి ఖాతాలో రూ.1,000 జమ అవుతున్నది. అయితే జీరో ఎండీఆర్ పాలసీ రైద్దెతే కస్టమర్ పేమెంట్‌ను ప్రాసెస్ చేసినందుకు బ్యాంకులు, పీఎస్పీలు వ్యాపారుల దగ్గర చార్జీలను వసూలు చేస్తాయి. దీనివల్ల వ్యాపారి ఖాతాలో రూ.1,000 కంటే తక్కువ జమవుతుంది. అయితే నష్టపోతున్న సదరు చార్జీ మొత్తాన్ని వ్యాపారులు కస్టమర్ దగ్గరే వసూలు చేసే వీలుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ప్రభుత్వ పెద్దలు తాము కస్టమర్ల పేమెంట్స్‌పై చార్జీలు వేయట్లేదంటున్నా.. ప్రాసెసింగ్ లేదా అదనపు చార్జీల పేరిటనో, వస్తువు ధరను పెంచో వ్యాపారులు కొనుగోలుదారుల వద్దే ఆ చార్జీలను రాబడుతారని హెచ్చరిస్తుండటం గమనార్హం. పైగా దీనివల్ల నెమ్మదిగా యూపీఐ లావాదేవీలు తగ్గుముఖం పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని వారంటున్నారు. పాత పెద్ద నోట్ల రద్దుతో దేశంలో ఆన్లైన్ చెల్లింపులను కేంద్రం ప్రోత్సహించిన సంగతి విదితమే.
పార్లమెంటరీ కమిటీ సూచన?
ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ ఏడాది మార్చిలో ఇచ్చిన నివేదిక ప్రకారం దేశంలో ఇప్పుడు జరుగుతున్న అన్ని డిజిటల్ లావాదేవీలలో దాదాపు 88 శాతం యూపీఐ ఆధారంగా చేస్తున్నవే. బ్యాంకులు, పీఎస్పీలు ప్రతి నెలా సుమారు రూ.30 లక్షల కోట్ల విలువైన 23 బిలియన్లకుపైగా లావాదేవీలను ప్రాసెస్ చేస్తున్నాయని కూడా కమిటీ తెలిపింది. ఈ క్రమంలోనే జీరో ఎండీఆర్ పాలసీ.. యూపీఐ ఎకోసిస్టమ్‌ను దీర్ఘకాలంలో ఆర్థికంగా అస్థిరపర్చగలదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అందుకే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా చర్యలకు దిగినట్టు చెప్తున్నారు.
ఇండస్ట్రీ మాటేంది?
గత ఏడాది మార్చిలో పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) కేంద్రానికి ఓ లేఖను సమర్పించింది. యూపీఐ, రూపే డెబిట్ కార్డ్ లావాదేవీలపై జీరో ఎండీఆర్ పాలసీని పునఃసమీక్షించాలని అందులో ఈ మెజారిటీ బ్యాంకింగేతర చెల్లింపుదారుల సంఘం కోరింది. జీరో ఎండీఆర్ విధానంతో ఆర్థిక అస్థిరత ఏర్పడే ప్రమాదముందన్నది. అందుకే రూపే డెబిట్ కార్డులపై వ్యాపారులందరికీ ఎండీఆర్‌ను ప్రతిపాదించింది. అలాగే బడా వ్యాపారులకు యూపీఐపై 0.3 శాతం ఎండీఆర్ చార్జీలు వేయాలన్నది.ఎండీఆర్ అంటే ఏమిటి?
కొనుగోలుదారులు నిత్యం రకరకాల దుకాణాలు, షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు, మరెన్నో చోట్ల చేసే ఆన్లైన్ (యూపీఐ) చెల్లింపుల (గూగుల్ పే, ఫోన్‌పే మొదలైనవాటి ద్వారా)ను బ్యాంకులు, పీఎస్పీలు ప్రాసెస్ చేస్తాయి. ఇందుకుగాను ఆయా వ్యాపారులు వాటికి చెల్లించే ఫీజునే మర్చంట్ డిస్కౌంట్ రేట్ లేదా ఎండీఆర్ అంటారు. 2020 నుంచి యూపీఐ, రూపే డెబిట్ కార్డు లావాదేవీలకు ఎండీఆర్ 0%గానే ఉంటున్నది. డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించడానికి అటు కస్టమర్లకు, ఇటు వ్యాపారులకు జీరో ఎండీఆర్ పాలసీని కేంద్రం వర్తింపజేస్తున్నది.