హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ ): సంగారెడ్డి జిల్లాలో నిర్మించనున్న సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులకు త్వరలో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని వివరించారు. శుక్రవారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో సభ్యులు క్రాంతికిరణ్, ఎం భూపాల్‌రెడ్డి, కే మాణిక్‌రావు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్‌రావు సమాధానమిచ్చారు. ఒకట్రెండు నెలల్లో టెండర్లు పిలిచి, ఖరారు చేస్తామని పేర్కొన్నారు. రూ. 2,653 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే సంగమేశ్వర, రూ.1,774 కోట్లతో చేపట్టే బసవేశ్వర ఎత్తిపోతల ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని వివరించారు.
వ్యవసాయరంగం వృద్ధిరేటులో దేశం మొత్తం మీద తెలంగాణ నంబర్ వన్ స్థానంలో నిలిచిందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రాథమికరంగంలో 19.70 శాతం వృద్ధి నమోదవ్వడం రికార్డు స్థాయి అని నీతిఆయోగ్ అధికారి రమేశ్‌చంద్ అభినందించిన విషయాన్ని గుర్తుచేశారు. వ్యవసాయరంగంలో సాధించిన వృద్ధిరేటుతో జీడీపీలో రాష్ట్ర వాటా 4.97 శాతానికి పెరిగిందని వివరించారు. గాదరి కిశోర్‌కుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి హరీశ్‌రావు సమాధానమిచ్చారు. సీఎం కేసీఆర్ విధానాలతోనే వృద్ధిరేటు సాధ్యమైందని పేర్కొనారు. తయారీరంగంలో 11.9%, వ్యాపార, మరమ్మతు సేవలరంగంలో 13.8%, రియల్ఎస్టేట్, నివాస యాజమాన్యం, ప్రొఫెషనల్ సేవల రంగంలో 21.1% వృద్ధి నమోదైనట్టు వెల్లడించారు.
రాష్ట్రంలోని 475 కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)ను ఇంటర్మీడియట్ వరకు అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సభ్యులు సైదిరెడ్డి, హరిప్రియనాయక్, రవిశంకర్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సబిత సమాధానమిచ్చారు. కొత్త మండలాల్లోనూ కేజీబీవీలను ఏర్పాటుచేస్తామని ప్రకటించారు.