హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ) : వీరనారి చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీ బిల్లుకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం గెజిట్ జారీచేసింది. దీంతో వర్సిటీ ఏర్పాటు ప్రక్రియలో తుది అంకం పూర్తయింది. ప్రభుత్వం జీవోను జారీచేయడంతో యూజీసీ గుర్తింపునకు వర్సిటీ అధికారులు దరఖాస్తు చేయనున్నారు. యూజీసీ గుర్తింపు లాంఛనమేకానుంది. అయితే ఇప్పటికే చదువుతున్న విద్యార్థులకు ఏ పేరుతో సర్టిఫికెట్లు ఇవ్వాలన్న అంశంపై సందిగ్ధత కొనసాగుతున్నది. దీనిపై అధికారులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.
ప్రతిష్టాత్మక కోఠి మహిళా కాలేజీని తెలంగాణ ఉమెన్ వర్సిటీగా అప్‌గ్రేడ్ చేస్తూ గత కేసీఆర్ ప్రభుత్వం జీవో జారీచేసింది. అప్పట్లో తెలంగాణ మహిళా యూనివర్సిటీగా నామకరణం చేశారు. ఇటీవల కాంగ్రెస్ సర్కారు పేరుమార్చి, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీ అన్న పేరును ఖరారుచేసింది. వర్సిటీ అభివృద్ధికి ఐదేండ్ల ప్రణాళికలను రూపొందించినట్టు వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ సూర్యాధనుంజయ్ తెలిపారు. రూ.100 కోట్ల బడ్జెట్‌తోపాటు, పోస్టుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని పేర్కొన్నారు. ఇంజినీరింగ్, టెక్నాలజీ, లా, బీఈడీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ తదితర కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ ఫిజియోథెరపీ, సీఎస్ఈ -ఏఐఎంఎల్, డాటాసైన్స్ వంటి కోర్సులను సైతం ప్రవేశపెడతామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. నైపుణ్యాలకు అధిక ప్రాధాన్యమిస్తూ స్కిల్ హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.