హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లు మంగళవారం లోక్‌సభకు రావడంతో తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొన్నది. రాష్ట్ర నలుమూలల నుంచి అనుచరులు, అభిమానులు, మహిళా బిల్లు కోసం పోరాటం చేసిన మహిళా హక్కుల సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్సీ కవిత ఇంటికి తరలివచ్చారు. లోక్‌సభలో మహిళా బిల్లును ప్రవేశపెడుతున్న సందర్భంలో, రాజ్యసభలో మహిళా బిల్లుపై ప్రధాని మోదీ ప్రసంగిస్తున్న సమయంలో ఎమ్మెల్సీ కవిత తన ఇంట్లో పలువురు మహిళా ప్రముఖులతో కలిసి టీవీ ప్రత్యక్ష ప్రసారాలను ఆసక్తిగా తిలకించారు. బిల్లు ప్రవేశపెట్టే సమయంలో ఆమె అమితానందానికి లోనయ్యారు.
‘జై తెలంగాణ.. జై బీఆర్ఎస్, జై కేసీఆర్.. వర్ధిల్లాలి మహిళా శక్తి’ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు ఆమె ఇంటి పరిసర ప్రాంతాలన్నీ మహిళా ప్రతినిధులతో నిండిపోయాయి. డప్పు చప్పుళ్లతో ధూంధాం చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు కవితకు శుభాకాంక్షలు తెలిపారు. మిఠాయిలు తినిపించారు. ఒకరిపై ఒకరు రంగులు, గులాల్ చల్లుకున్నారు. ఎమ్మెల్సీ కవిత నాయకత్వం వర్ధిల్లాలి…జై కేసీఆర్.. జై కవితక్క అంటూ నినదించారు. పలువురు అభిమానులు ఆమెకు ఖడ్గాన్ని బహూకరించారు. వివిధ మహిళా హక్కుల సంఘాల ప్రతినిధులు శుభాకాంక్షలతో ముంచెత్తడం విశేషం. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ ఎమ్మెల్సీ కవిత ఇంటికి వెళ్లి, అభినందించారు. కవిత పోరాటం వల్లే మహిళా బిల్లు ప్రవేశపెడుతున్నారని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ కవిత వల్లే: ‘సెర్ప్’ స్టేట్ జేఏసీ
ఎమ్మెల్సీ కవిత సుదీర్ఘ పోరాటంతోనే కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ముందుకు తెచ్చిందని సెర్ప్ ఉద్యోగ సంఘాల స్టేట్ జేఏసీ నాయకులు కుంట గంగాధర్‌రెడ్డి, ఏపూరి నర్సయ్య, సుదర్శన్ మహేందర్‌రెడ్డి, భారతి పేర్కొన్నారు.
కవిత పోరాట ఫలితమే: కాశీనాథ్
ఎమ్మెల్సీ కవిత పోరాట ఫలితంగానే మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టిందని హైదరాబాద్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ కాశీనాథ్ పేర్కొన్నారు.
కవిత పోరాటం భేష్: కే కేశవరావు
మహిళా రిజర్వేషన్ బిల్లుకోసం ఎమ్మెల్సీ కవిత పోరాటం భేష్ అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీనేత కే కేశవరావు అభినందించారు. కేంద్రం ప్రవేశపెట్టిన మహిళా బిల్లును తాము సంపూర్ణంగా స్వాగతిస్తున్నామని, తమ డిమాండ్లలో ప్రధానమైన బీసీ బిల్లు విషయంలో కేంద్రం తన చిత్తశుద్ధిని చాటుకోవాలని కోరారు. బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం దేశం ఎదురుచూస్తున్నదని చెప్పారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం తాము సోమవారం ధర్నా చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో తమ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమై మహిళా రిజర్వేషన్ బిల్లుతోపాటు బీసీ రిజర్వేషన్ బిల్లుకోసం తీర్మానం చేశామని గుర్తు చేశారు.
కవిత నిర్విరామ పోరాటం: కోలేటి
ఎమ్మెల్సీ కవిత నిర్విరామ పోరాట ఫలితంగానే మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టిందని రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మ న్ కోలేటి దామోదర్ తెలిపా రు. కవిత పోరాటానికి కేంద్రం తలొగ్గిందని చెప్పారు. మహిళా బిల్లును పక్కనపెట్టిన కేంద్రాన్ని శాంతియుత ఆందోళనలతో మేల్కొలిపి కోట్లాది మంది మహిళలకు కవిత మేలు చేశారని కొనియాడారు.
కవిత పోరాటంతోనే: మంత్రి సత్యవతి రాథోడ్
Satyavati Rathore
ఎమ్మెల్సీ కవిత పోరాట ఫలితంగానే మహిళా రిజర్వేషన్ బిల్లు సాకారమవుతున్నదనిమంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మహిళా బిల్లుపై కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని స్పష్టం చేశారు. మహిళా బిల్లు వెనుక సీఎం కేసీఆర్ కృషి దాగి ఉన్నదని చెప్పారు. ఈ ఏడాది మార్చిలో కవిత సారథ్యంలో తామంతా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగామని, రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహించామని తెలిపారు.
కవిత పోరాటం ప్రశంసనీయం: మహేశ్ బిగాల
ఎన్నో ఏండ్లు గా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఎమ్మెల్సీ కవిత పోరాడిన తీరు ప్రశంసనీయమని బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల పేర్కొన్నారు. మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే మద్దతు ఇస్తామని తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం తీర్మానం చేసిందని గుర్తు చేశారు. ఈ బిల్లుకు మద్దతు పలకాలని దేశంలోని 49 రాజకీయ పార్టీలను కవిత ఏకతాటిపైకి తీసుకొచ్చారని ప్రశంసించారు. ళా రిజర్వేషన్ బిల్లుకు ఎన్ఆర్ఐల మద్దతు కోసం తాముకూడా మార్చిలో ప్రచారం చేసినట్టు తెలిపారు.