
హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ)/తెలుగుయూనివర్సిటీ: ఆడపిల్లల పట్ల సమాజం ఆలోచనా విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని కింగ్‌కోఠిలో మలబార్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సామాజిక సేవా బాధ్యతల్లో భాగంగా 500 మంది పేద విద్యార్థులకు, ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ.. పిల్లల పెంపకంలో లింగ వివక్ష చూపకూడదన్నారు. ఆడ, మగ పిల్లలను సమానంగా పెంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని చెప్పారు. ఆడపిల్లలు ధైర్యంగా తమ సమస్యను తామే ఎదురొనే విధంగా ఎదగాలని సూచించారు. ప్రభుత్వాలు మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు, కమిషన్లు ఏర్పాటు చేస్తున్నాయని వివరించారు. మహిళా కమిషన్ మహిళలకు రక్షణ హక్కులపై అవగాహన కల్పిస్తున్నదన్నారు. కార్యక్రమంలో గడ్డిఅన్నారం ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టీ శ్రీనివాస్, మలబార్ గోల్డ్ టీం సభ్యులు సిరాజ్, కే షరీజ్ తదితరులు పాల్గొన్నారు.