హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 6(నమస్తే తెలంగాణ) : వేధిస్తున్నాడు, న్యాయం చేయండని వేడుకున్న మహిళకు ఇదో కొత్తరకం వేధింపులు. గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న అధికారి మరీ నీచపు పనికి దిగజారిన దుస్థితి. ఒంటరి మహిళ అని కూడా చూడకుండా, మానసికంగా కుంగిపోతున్న ఆమె దయనీయ స్థితిని పట్టించుకోకుండా ‘కోరిక’ను బయటపెట్టుకుని దిగజారిన ఖాకీ వైనం. కేసు పెట్టాలంటే పేచీ పెట్టకుండా ఒంటరిగా రావాలి., ఫిర్యాదు పట్టించుకోవాలంటే ‘కనీసంగా లాలించాలి’ అని బుద్ధి బయటపెట్టి తన కరుడుగట్టిన కాఠిన్యాన్ని చూపిన ఆఫీసర్ వక్రమిది. పేరుకే ఫ్రెండ్లీ పోలీసింగ్ తప్ప మా తరీఖా మారదు, ఎన్ని గుణపాఠాలు చెప్పినా మా ‘అక్రమ బుద్ధి తీరదు’ అన్నట్టుగా వ్యవహరించి శాఖకే మచ్చగా మారిన ఆ పోలీస్ ఆఫీసర్ ఉదంతం చర్చనీయాంశమైంది. చేసేది లేక, న్యాయం దేవుడెరుగు కనీసం బతుకైనా బతకనివ్వండని వేడుకునేలా ఆ ఒంటరి మహిళను వేధిస్తున్న వ్యవస్థ తాలూకు ఉదంతమిది. వివరాలిలా ఉన్నాయి.
నగరంలోని ఓ కోర్టుకు సమీపంలో ఉన్న డివిజన్ పోలీసు కార్యాలయం అది. అదే డివిజన్ పరిధిలో ఒంటరిగా తన 13 ఏళ్ల కొడుకుతో ఉంటున్న ఓ దళిత మహిళ న్యాయం చేయాలని కార్యాలయానికి వెళ్లింది. తన ఇంటికి ఎదురుగా వాహనాన్ని నిలిపినందుకు తీయాలని చెప్పిన పాపానికి వేధిస్తున్న వ్యక్తిపై ఫిర్యాదు చేసింది. నాపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తావా.. అంటూ సదరు వ్యక్తి రోజురోజుకూ మహిళపై మరిన్ని వేధింపులు పెంచాడు. దీంతో సదరు మహిళ తనకు ఆ బాధనుంచి విముక్తి కల్పించాలని పదేపదే సదరు పోలీసు అధికారిని వేడుకుంది. ఇక్కడే ఆ పోలీసు వక్రబుద్ధి బయటపడింది. ‘నీకు న్యాయం చేస్తా.. నాకేంటి..’ అనే రీతిగా తనలోని అసలు కోణాన్ని బయటకు తీశాడు. నీ ఫిర్యాదుపై కేసు నమోదు చేయాలంటే ఒంటరిగా రాత్రి చెప్పిన చోటుకు రావాలని ప్రేరేపించాడు. ఇక్కడే తెలివిగా సిబ్బందితో రాత్రి ఫోన్లు చేయించి ఆ మహిళను నానాటికి వేధించడం మరింత పెంచాడు. దీంతో ఆ మహిళ ఏం చేయాలో అర్థం గాక.. తనకు న్యాయం చేయాలని వేడుకుంటూ ఉన్నతాధికారులను శరణు కోరింది.
ఆరు నెలలైనా చర్యల్లేవ్
తనను డివిజన్లోని సదరు వ్యక్తి వాహనం పక్కకు తీయాలని చెప్పిన పాపానికి నిత్యం తిడుతున్నాడని, మానసికంగా వేధిస్తున్నాడని గత జూన్ లో ఫిర్యాదు చేసినా ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని బాధితురాలు మీడియా ఎదుట వాపోయింది. తనను రోజు లైంగింకంగా వేధించడమే కాకుండా, ఒక్కదానివే ఉంటున్నావ్.. నేను.. లేనా.. అనే అసభ్యకరమైన మాటలతో చిత్రవధకు గురిచేస్తున్నాడని చెప్పినా పోలీసు అధికారి పట్టించుకోవడం లేదని గోడు వెల్లబోసుకుంటున్నది. గత సంవత్సరం జూన్ లో పేరుకు కేసు పెట్టినా చర్యలకు మాత్రం సదరు అధికారి పూనుకోకపోవడం, లైంగికంగా వశపర్చుకోవాలని చూస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.
ఫిర్యాదు చేసిన వ్యక్తికి చట్టం ప్రకారం ఇబ్బందికాకుండా కేసు నమోదు చేశారని కన్నీటి పర్యంతమైంది. నిజానికి అతడొక్కడే తనను వేధిస్తే కేసు మరో ఇద్దరు గుర్తు తెలియని మహిళల ప్రస్తావన తీసుకొచ్చి ఆ వ్యక్తికి చట్టపరంగా ఏమీ కాకుండా పోలీసులు ముందే జాగ్రత్తపడ్డారని సదరు దళిత మహిళ వాపోయింది. ఈ విషయమై సుమారు మూడు నెలల కిందట సౌత్ జోన్ ఉన్నతాధికారి దగ్గరకు వెళ్లినా ఇప్పటికీ న్యాయం జరగలేదని ఆరోపిస్తున్నది. తనను వేధిస్తున్న వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టాల్సిన సదరు డివిజన్ అధికారి మరింతగా వేధించడం, అటు పోలీసుల అండతో ఆ వ్యక్తి ఇంకా రెచ్చిపోతుండడంతో న్యాయం చేయాలని బాధితురాలు మీడియా ఎదుట గోడు వెల్లబోసుకుంది. ఈ విషయంలో పోలీసు బాస్ నుంచి తనకు రక్షణ కల్పించాలని, సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు వేడుకుంటున్నది.