కరీంనగర్ కలెక్టరేట్, జనవరి 17: అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుడి వేధింపులు భరించలేక ఓ మహిళ బుధవారం కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేసింది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం హన్మాజిపల్లికి చెందిన కూరపాటి గీత ఒంటిపై పెట్రోల్ పోసుకుంటుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. గన్నేరువరం ఎంపీపీ లింగాల మల్లారెడ్డి వేధింపులేనని తన ఆత్మహత్యాయత్నానికి కారణం అంటూ నినాదాలు చేస్తూ బంధువులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగింది. గన్నేరువరం మండలం హన్మాజిపల్లిలో కూరపాటి సమ్మయ్య గతంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పనిచేశాడు. ప్రస్తుతం ఆయన గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఎంపీపీ లింగాల మల్లారెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్నాడు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీపీ కాంగ్రెస్‌లో చేరి.. సమ్మయ్యను కూడా చేరాలని ఒత్తిడి చేశాడు. దీనిని పట్టించుకోని సమ్మయ్య కొద్దిరోజుల నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ కిరాణాషాపు నడిపిస్తున్నాడు. తాను చెప్పినట్టు వినకపోతే కుటుంబం మొత్తాన్ని చంపుతానంటూ బెదిరింపులకు గురిచేశాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన సమ్మయ్య మంగళవారం అర్ధరాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని, ప్రస్తుతం ఆయన కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. తన కుటుంబానికి జరుగుతున్న అన్యాయంపై సమ్మయ్య భార్య గీత బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. ఎవరూ పట్టించుకోలేదు. చేసేది లేక కలెక్టరేట్ ఎదుట వారి కుటుంబసభ్యులతో కలిసి ఆందోళనకు దిగింది.
ఔట్‌పోస్టు పోలీసులు వారిస్తుండగా తనవెంట సీసాలో తెచ్చుకున్న పెట్రోల్‌ను తనపై చల్లుకున్నది. వెంటనే పోలీసులు ఆమెపై నీళ్లు చల్లి కాపాడారు. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎంపీపీ లింగాల మల్లారెడ్డి నుంచి తమ కుటుంబానికి హాని ఉన్నదని, తమకు రక్షణ కల్పించి, తన భర్తకు మెరుగైన వైద్యం అందించాలని, మల్లారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు గీత, ఆమె బంధువులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కరీంనగర్‌లోని దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితుడు సమ్మయ్యను ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్, మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు పరామర్శించారు.