మేడిపల్లి, ఏప్రిల్ 16 : ఇంట్లో తన కొడుకును చిన్న చూపు చూస్తున్నారన్న కారణంతో తోటి కోడలి కొడుకుపై దారుణానికి ఒడికట్టింది మహిళ. నాలుగేండ్ల బాలుడికి ఆమె యాసిడ్ తాగించింది. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇటీవల చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బోడుప్పల్‌లోని శ్రీనివాసకాలనీలో నివసిస్తున్న సతీశ్‌కుమార్, అంజమ్మ దంపతులకు కు మారులు నాగరాజు, జగదీశ్ ఉన్నారు. వీ రిద్దరికి పెండ్లి అయ్యి పిల్లలు కూడా ఉన్నా రు. అందరూ ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. అయితే పెద్దకుమారుడి కొడుకుపైనే తాత ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారని, తన కు మారుడిని పట్టించుకోవడం లేదని చిన్న కో డలు మంజుల కక్ష పెంచుకున్నది.
ఇటీవల తాత తన చెయ్యిపై పెద్దకుమారుడి కొడుకు పేరు పచ్చబొట్టు వేయించుకున్నారు. దీంతో మరింత కక్షతో రగిలిపోయిన ఆమె ఆ బాలుడిని అంతమొందించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. కొద్దిరోజుల కిందట చిన్నారి నోరు, ముక్కు మూసి చే తులు గట్టిగా పట్టుకున్నది. గమనించిన బాలుడి తల్లి ప్రశ్నించడంతో ఆడుకుంటున్నామని చెప్పి తప్పించుకుంది. మరోసారి బాలుడిని ఇంటిపైకి తీసుకెళ్లి రెయిలింగ్‌పై కూర్చోబెట్టింది. ఇది చూసిన తాత ఆమెను మందలించాడు. తాజాగా ఈ నెల 9న మంజుల బాలుడిని కిచెన్‌లోకి తీసుకెళ్లి జ్యూస్ తాగితే చాక్లెట్ ఇస్తానని నమ్మించి యాసిడ్ తాగించింది. బాలుడి పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు వెంటనే దవాఖానకు తీసుకెళ్లి చికిత్స అందించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.