హైదరాబాద్, జనవరి20 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారు తీరుతో ఎస్సారెస్పీ స్టేజీ-2 కింద ఉన్న ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించటం కష్టంగా మారే ప్రమాదం ఏర్పడింది. ప్రస్తుత సర్కారు తీరు రైతన్నలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట గత సర్కారును బద్నాం చేయడంపై పెట్టిన దృష్టిని, పంటలు ఎండిపోకుండా తీసుకోవాల్సిన చర్యలను చేపట్టడంలో చూపటం లేదు. బరాజ్‌లు రిపేర్‌లో ఉన్నా నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నదని అధికారులు చెప్తున్నా, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదు. వెరసి ప్రాణహిత నుంచి వచ్చే జలాలు దిగువకు వృథాగా పోతున్నాయి. మరోవైపు ప్రాజెక్టుల్లో నిల్వలు చూస్తే ప్రతిపాదించిన ఆయకట్టుకు నీరందడం కష్టంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఎస్సారెస్పీ చివరి ఆయకట్టుకు నీరందేనా?
ఎస్సారెస్పీ స్టేజ్-1లో అంటే ఎల్ఎండీకి ఎగువన అంటే ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాలువ 0-146 కిలోమీటర్ల వరకు 4,62,920 ఎకరాలు, దిగువన అంటే కాకతీయ కెనాల్ 146-284 కిలోమీటర్ల వరకు 5,05720 ఎకరాలు మొత్తంగా 9,68,640 ఎకరాల ఆయకట్టుకు నీరందించాల్సి ఉన్నది. అందులో 1/3 తరి, 2/3 మెట్టపంటలకు నీరు అందించేలా ప్రాజెక్టును డిజైన్ చేశారు. కాకతీయ కాలువను 284 కిలోమీటర్ నుంచి 347 కిలోమీటరు వరకు ఎస్సారెస్పీ స్టేజ్-2గా పిలుస్తారు. దీని కింద 3,71,691 ఎకరాలు ఉన్నది. ఆ తరువాత అది మూసీలో కలుస్తుంది.
ఎస్సారెస్పీ ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీళ్లు ఉంటేనే స్టేజ్-1 కింది ఆయకట్టుకు యాసంగిలో నీటి భరోసా ఉంటుంది. స్టేజ్-2 పరిస్థితి అంతంతే. ఈ నేపథ్యంలోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సారెస్పీ ప్రాజెక్టును ఎల్ఎండీ ఎగువ ఆయకట్టుకే పరిమితం చేసింది. దిగువ ఆయకట్టుకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని అందించాలని సంకల్పించింది. ఆ మేరకు నీటిని ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేస్తూ మూడేండ్లుగా ఎస్సారెస్పీ స్టేజ్-2 చివరి ఆయకట్టుకు విజయవంతంగా సాగునీటిని అందించింది.
ఈ ఏడాది యాసంగిలో కూడా ఎస్సారెస్పీ స్టేజ్-1, స్టేజీ-2 కింద 11.26 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే ప్రస్తుతం ఎస్సారెస్పీ, మిడ్‌మానేర్, ఎల్లంపల్లి, ఎల్ఎండీ ప్రాజెక్టుల్లో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు లేవు. 100 టీఎంసీల లోపే ఉంటాయని తెలుస్తున్నది. దాదాపు మరో 10 టీఎంసీల వరకు అవసరం అవుతాయని అధికారుల అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సారెస్పీ చివరి ఆయకట్టుకు నీరందుతుందా? అన్నది అనుమానంగా మారింది.
ఇప్పటికీ నీటిని ఎత్తిపోసుకునే అవకాశం
ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి మొదలు దిగువ ఉన్న పార్వతి, సరస్వతి బరాజ్‌లకు ఎగువ నుంచి చుక్క నీరు రావడం లేదు. అయినప్పటికీ వాటి దిగువన ఉన్న లక్ష్మీబరాజ్ వద్ద ఇప్పటికీ నీటి ప్రవాహాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రాణహిత నుంచి సగటున రోజుకు 6 వేల క్యూసెక్కుల నీరు లక్ష్మీ బరాజ్(మేడిగడ్డ)కు వస్తున్నది. అయితే బరాజ్ పిల్లర్ల కుంగుబాటు ఘటన, పరీక్షల నేపథ్యంలో గేట్లన్నీ ఓపెన్ చేసి దిగువకు ఆ జలాలను విడుదల చేస్తున్నది. కానీ ప్రస్తుతం బరాజ్ డ్యామేజీ ప్రాంతంలో కాఫర్ డ్యామ్‌ను 96.5 మీటర్ల ఎత్తుతో నిర్మించారు.
95 మీటర్ల మేర నీటి ప్రవాహ ఎత్తును మెయింటెన్ చేస్తే జలాలు అప్రోచ్ చానల్‌కు, తద్వారా పంప్‌హౌజ్‌కు చేరుకుంటాయి. అక్కడి నుంచి ఎత్తిపోసుకోవచ్చు. ఎగువన ఉన్న అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల సీపేజీలను కూడా అధికారులు ఇప్పటికే అరికట్టారు. గ్రౌటింగ్ పూర్తి చేసి పరీక్షలు నిర్వహించారు. ఇబ్బందేమీ లేదని నిర్ధారణకు వచ్చారు. బరాజ్ రిపేర్లు కొనసాగుతున్నా సాంకేతికంగా జలాలను ఎత్తిపోసుకునేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కచ్చితంగా ఎత్తిపోసుకోవాల్సిందేనని, లేదంటే చివరి ఆయకట్టుకు నీరందడం కష్టమేనని అధికారులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.
దృష్టి సారించని కాంగ్రెస్ సర్కారు
ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఆ దిశగా దృష్టి సారించడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ సర్కారును బద్నాం చేయటంపైనే దృష్టి సారించింది తప్ప, సాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా జలాలను ఎత్తిపోసుకోవాలనే దానిపై మాత్రం దృష్టి సారించడం లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం వెంపర్లాడుతూ రైతు ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తున్నదని విమర్శలు వినిపిస్తున్నాయి. జలాలను ఎత్తిపోయడం ద్వారా ఎస్సారెస్పీ ఆయకట్టుకే కాదు ప్రాజెక్టుకు అనుసంధానించిన ఇతర ప్రాజెక్టులు, చెరువులను కూడా నింపవచ్చని, తద్వారా వాటికింది ఆయకట్టుకు కూడా పూర్తి భరోసా కల్పించవచ్చనే ఆలోచన చేయడం లేదు.
(నోట్: ఇందులో రాబోయే వానకాలం వరకు దాదాపు అన్ని ప్రాజెక్టులు కలిపి తాగునీటి అవసరాలకు సుమారు 5 టీఎంసీలకుపైగా నీరు అవసరం అవుతుంది. నికరంగా 100 టీఎంసీల కంటే తక్కువే అందుబాటులో ఉంటుందని చెప్పవచ్చు)