నాంపల్లి కోర్టులు, మే 17 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితుల కస్టడీకి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులో వేసిన పిటిషన్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉపసంహరించుకున్నది. నిందితులకు నోటీసులు జారీచేయాలని జిల్లా జడ్జి ప్రేమవతి ఆదేశించారు. ప్రధాన నిందితులు ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డి వాంగ్మూలాలను జైల్లో ఈడీ నమోదు చేసింది. మిగతావారిది కూడా చేసేందుకు 12వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టును ఈడీ ఆశ్రయించగా, తిరస్కరించింది. దీంతో నిందితులకు నోటీసులు ఇచ్చి తర్వాత వాంగ్మూలాల నమోదుకు కసరత్తు చేస్తున్నది.
బెయిల్ పటిషన్ కొట్టివేత
ఇదే కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కుమార్, కోస్గి రవికుమార్, కోస్గి భగవంత్‌కుమార్ వేసిన బెయిల్ పిటిషన్లను బుధవారం కోర్టు కొట్టివేసింది. కొత్తవారిని రిమాండ్‌కు తరలిస్తున్న నేపథ్యంలో ప్రధాన నిందితుడితోపాటు ఇద్దరికి బెయిల్ మంజూరు చేయవద్దని సిట్ పీపీ కోర్టును కోరారు. పీపీ వాదనలతో ఏకీభవించిన మెజిస్ట్రేట్ ముగ్గురి బెయిల్ పిటిషన్లను కొట్టివేశారు. సిట్ కస్టడీలో ఆరుగురి విచారణ కొనసాగుతున్నదని, ఆధారాల సేకరణకు సమయం అవసరమని పీపీ తెలిపారు. సాయిలౌకిక్, సుస్మిత దంపతుల బెయిల్ పిటిషన్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి.